సౌతాఫ్రికా 20 లీగ్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. వరుసగా నాలుగు సీజన్లలో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ మూడు సార్లు టైటిల్‌ను ముద్దాడింది. దాంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓడించిన క్షణం గ్యాలరీలో కావ్య మారన్ చేసిన సందడి మాములుగా లేదు.
తన తండ్రి కళానిధి మారన్‌తో కలిసి ఈ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన కావ్య మారన్.. విజయం సాధించిన వెంటనే ఎగిరి గంతేసింది. 'నాన్న మనం మూడు టైటిల్స్ గెలిచాం'అని తన చేతి వేళ్లతో చూపిస్తూ.. చిన్న పిల్లలా సంబరాలు చేసుకుంది. తన తండ్రి హగ్ చేసుకొని, గట్టిగా అరుస్తూ సందడి చేసింది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కావ్య మారన్ చిన్న పిల్లలా ఇచ్చిన ఈ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సన్‌రైజర్స్ గెలవడం కంటే కావ్య పాప ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా ఈ సీన్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు.

నాలుగేళ్ల సౌతాఫ్రికా20 లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మూడోసారి విజేతగా నిలిచింది. అరంగేట్ర సౌతాఫ్రికా20 లీగ్ 2023 సీజన్‌తో పాటు 2024 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ అందుకుంది. 2025లో ఫైనల్ చేరినా.. తృటిలో హ్యాట్రిక్ టైటిల్ మిస్సైంది. తాజా సీజన్‌లోనూ విజేతగా నిలిచి మూడో టైటిల్ అందుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ కావ్య మారన్ సెలెబ్రేట్ చేసుకుంది.
ఫైనల్లో ట్రిస్టన్ స్టబ్స్, మాథ్యూ బ్రెట్జ్‌కీ అజేయ హాఫ్ సెంచరీలతో రాణించి విజయాన్నందించారు. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును అద్వితీయమైన బ్యాటింగ్‌తో గెలిపించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది.
డెవాల్డ్ బ్రెవిస్(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101) సెంచరీతో రాణించగా.. బ్రైస్ పార్సన్స్(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్(3/10) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా, అన్రిచ్ నోర్జ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 19.2 ఓవర్లలో సన్‌రైజర్స్ 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. మాథ్యూ బ్రెట్జ్‌కీ(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) , ట్రిస్టన్ స్టబ్స్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. లుంగి ఎంగిడి, రోస్టన్ ఛేజ్, లిజాడ్ విలియమ్స్ తలో వికెట్ తీసారు.