టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 'నెవర్ గివప్' అప్రోచ్‌తోనే ఇంగ్లండ్‌పై ఆశించిన ఫలితం అందుకున్నామని వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ అన్నాడు. సీరిస్ ప్రారంభానికి ముందే గంభీర్.. ఇది యంగ్ టీమ్ కాదని, గన్ టీమ్ అని నిరూపించుకోవాలని చెప్పాడని తెలిపాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే.
ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2027 ఎడిషన్ ప్రారంభం కాగా.. టీమిండియా ఘనంగా మొదలుపెట్టింది.

తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన కరుణ్ నాయర్.. గంభీర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఈ సిరీస్ ప్రారంభానికి ముందే గౌతీ భాయ్ మా అందరితో ఓ మాట అన్నాడు. ఇది యంగ్ టీమ్ కాదని, గన్ టీమ్ అని నిరూపించుకోవాలని చెప్పాడు. ప్రతీ ఒక్కరూ ఇదే మైండ్‌సెట్‌తో ఆడాలని చెప్పాడు. ఈ మాటలు జట్టులో చాలా ప్రభావం చూపించాయి. ఒకరికొకరు మద్దతుగా ఉన్నాం. లార్డ్స్‌లో కనబర్చిన పోరాటం ఎప్పటికీ గుర్తూ ఉంటుంది. కీలక వికెట్లు కోల్పోయిన సమయంలోనూ నితీష్, సిరాజ్, బుమ్రాతో కలిసి జడేజా చేసిన పోరాటం అద్భుతం. ఓటమికి తలవంచని అటిట్యూడ్ ప్రదర్శించాం.
ఆఖరి వరకూ పోరాడినా ఓటమిపాలు కావడం నిరాశకు గురి చేసింది. కానీ ఆ స్ఫూర్తి మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పాదం ఎముక విరిగినా రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చిన క్షణాలు గుర్తుండిపోతాయి. ఆఖరి టెస్ట్ విజయానంతరం మేం ఎక్కడా అతిగా సంబరాలు చేసుకోలేదు. ఇంగ్లండ్ ప్లేయర్లతోనూ చక్కగా మాట్లాడం. ఇరు జట్లకూ ఇది చాలా గొప్ప సిరీస్‌గా మిగిలిపోతుంది. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కూడా ఇలాగే స్పందించాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ప్లేయర్లుగా మేం అలా ఆలోచించం. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటుంటే ఏదో సాధించామని అనిపిస్తోంది.'అని కరుణ్ నాయర్ చెప్పుకొచ్చాడు.