ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక, సౌరాష్ట్ర సెమీఫైనల్ చేరాయి. సోమవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక విజేడీ పద్దతిన 55 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేయగా.. సౌరాష్ట్ర కూడా విజేడీ పద్దతిన 17 పరుగులతో యూపీని ఓడించింది.
బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. ఫలితాన్ని వీజేడీ పద్దతిన తేల్చారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు చేసింది. షామ్స్ ములానీ(91 బంతుల్లో 8 ఫోర్లతో 86) రాణించగా.. సిద్దేష్ లాడ్(38) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో విద్వాత్ కావేరప్ప(2/43), అభిలాష్ శెట్టి(2/59) రెండేసి వికెట్లు తీయగా.. విద్యధార్ పాటిల్(3/42) మూడు వికెట్లు పడగొట్టాడు. విజయ్‌కుమార్ వైశాఖ్(1/59) ఒక వికెట్ తీసాడు.
అనంతరం కర్ణాటక మ్యాచ్ ఆగిపోయే సమయానికి 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(95 బంతుల్లో 11 ఫోర్లతో 81 నాటౌట్), కరుణ్ నాయర్(80 బంతుల్లో 11 ఫోర్లతో 74 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.

సీఓఈ-2 మైదానంలో జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ గోస్వామి(82 బంతుల్లో 12 ఫోర్లతో 88), సమీర్ రిజ్వీ(77 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. రింకూ సింగ్(13) తీవ్రంగా నిరాశపర్చాడు.
సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా(3/54) మూడు వికెట్లు తీయగా.. అంకుర్ పన్వార్, ప్రేరక్ మన్కడ్ రెండేసి వికెట్లు తీయగా.. పర్సవరాజ్ రాణా ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం సౌరాష్ట్ర వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. హర్విక్ దేశాయ్(116 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. చిరాగ్ జానీ(40 నాటౌట్) వేగంగా ఆడాడు. యూపీ బౌలర్లలో కరణ్ చౌదరి, ప్రశాంత్ వీర్, విప్రజ్ నిగమ్ తలో వికెట్ తీసారు. మూడో,నాలుగో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మంగళవారం బెంగళూరులోని సీఓఈ వేదికగానే జరగనున్నాయి.