దేశ ప్రధానిని కలిసే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా.. ఆటగాడైనా సరే పరుగెత్తుకుంటూ వస్తారు. కానీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం దేశ ప్రధానినే లెక్క చేయలేదంట. తన బ్యాటింగ్ కంటే ఏది ముఖ్యం కాదని చెప్పాడంట. ఈ విషయాన్ని ఆయన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కర్సన్ ఘవ్రి.. గవాస్కర్ ఎవరి మాట వినేవాడు కాదని, అతను ఓ ఛాంపియన్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా 1971-1987 సమయంలో గవాస్కర్ భారత క్రికెట్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడని గుర్తు చేసుకున్నారు.
'ఢిల్లీ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి సునీల్ గవాస్కర్ సిద్దమయ్యాడు. ప్యాడ్లు కట్టుకొని డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని బ్యాటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో అప్పటి టీమ్ మేనేజర్ రాజా సింగ్ వచ్చి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ ఆటగాళ్లను కలవాలనుకుంటున్నారని చెప్పారు. ఆటగాళ్లంతా మైదానానికి రావాలని కోరాడు. అయితే మొరార్జీ దేశాయ్ 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అప్పటికే టాస్ వేసారు.

భారత్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. దాంతోనే ఓపెనర్‌గా గవాస్కర్ ప్యాడప్ అయి సిద్దంగా ఉన్నాడు. ప్రధానమంత్రిని కలవడానికి తనకు సమయం లేదని మేనేజర్‌తో చెప్పాడు. ఒంటరిగా వదిలేయాలని, తనకు, జట్టుకు బ్యాటింగ్ చేయడం చాలా కీలకమని చెప్పాడు. దాంతో గవాస్కర్ మినహా మిగతా ఆటగాళ్లమంతా మొరార్జీ దేశాయ్‌ను కలిసి ఆయన అభినందనలను అందుకున్నాం. కానీ గవాస్కర్ మాత్రం ప్రధానిని కలిసేందుకు రాలేదు.
టీ సెషన్ వరకు సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ చేశాడు. మెరుగైన స్కోర్ సాధించాడు. గవాస్కర్‌ను కలవడానికే ప్రధాని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారని ఆ రోజు ఆట పూర్తయ్యేవరకు మాకు తెలియలేదు. ఇది గవాస్కర్. తన హయాంలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు.' అని కర్సన్ ఘవ్రి చెప్పుకొచ్చారు. 1975 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గవాస్కర్ 174 బంతులాడి 36 పరుగులు చేసిన ఘటనను కూడా ఘవ్రి గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో వేగంగా ఆడాలని చెప్పినా గవాస్కర్ పట్టించుకోలేదని, తదుపరి టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశానని బదులిచ్చాడని తెలిపారు.
'భారత క్రికెటర్లుగా వన్డే క్రికెట్ ఎలా ఆడాలో మాకు తెలియదు. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ మా బ్యాటింగ్ సమయంలో సునీల్ గవాస్కర్ 60 ఓవర్ల పాటు ఆడాడు. చాలా సార్లు వేగంగా ఆడాలనే సందేశాన్ని డ్రెస్సింగ్ రూమ్స్ నుంచి పంపించాం. దూకుడుగా ఆడకుంటే ఔటవ్వాలని కూడా చెప్పాం. పేస్‌పై ఎదురుదాడికి దిగాలని తెలిపాం. కానీ సునీల్ గవాస్కర్ ఎవరి మాట వినలేదు.
టోనీ గ్రైగ్, జియోఫ్ ఆర్నాల్డ్, క్రిస్ ఓల్డ్, బాబ్ విల్స్‌లను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నెమ్మదిగా ఆడటానికి గల కారణాన్ని గవాస్కర్ చెప్పాడు. భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్‌లో వారిపై మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకున్నానని తెలిపాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో గందరగోళం నెలకొంది. ఈ ఇన్నింగ్స్‌పై మేనేజర్ ప్రశ్నించగా.. ఒంటరిగా వదిలేయాలని గవాస్కర్ అరిచాడు.'అని ఘవ్రి గుర్తు చేసుకున్నారు.