రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ వేడుకల్లో మరణించిన కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కర్ణాటక ప్రభుత్వం రూ.25 లక్షలకు పెంచింది. ముందుగా రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా రూ. 25 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి టైటిల్‌ను ముద్దాడింది
దాంతో బెంగళూరు వేదికగా విజయోత్స వేడుకలను భారీగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగమవ్వాలని ఆర్‌సీబీ పిలుపు ఇవ్వడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో ఆ రోజు బెంగళూరు ఎరుపెక్కింది. విధాన సౌధ నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించాలనుకున్నారు. కానీ వర్షంతో పాటు ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు ఈ పరేడ్‌ను రద్దు చేశారు.

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
స్టేడియం కెపాసిటీ 35వేలు మాత్రమే కాగా.. 3 లక్షల మంది అభిమానులు అక్కడికి వచ్చారు. దాంతో స్టేడియం బయట గేట్ నెంబర్ 7 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ కూడా ఉంది. మరో 50 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు అందజేస్తామని చెప్పింది.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆర్‌సీబీ ఫ్రాంచైజీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కేసులు నమోదు చేశారు. ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసెలెతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌లను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్ణాట ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషన్ బి దయానంద్‌ను సస్పెండ్ చేసింది. సీఎం సిద్దరమయ్య పొలిటికల్ సెక్రటరీ కూడా విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది.