వైభవ్ సూర్యవంశీని మరి అంతగా లేపకండి: కపిల్ దేవ్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈ 15 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ కోసం క్రికెట్ ప్రపంచమే రెండుగా చీలిపోయింది. వెంటనే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్, రవి శాస్త్రి, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు డిమాండ్ చేస్తుంటే.. అశ్విన్, సబా కరీం, చతేశ్వర్ పుజారా వంటి మాజీ ఆటగాళ్లు మాత్రం అతన్ని బెంచ్‌పై కూర్చోబెట్టాలని సూచిస్తున్నారు.
తద్వారా తుది జట్టులో అవకాశం రావడం ఎంత కష్టమో వైభవ్‌కు తెలియజేయాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీమిండియా మేనేజ్‌మెంట్ సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తోంది. దాంతో వైభవ్ సూర్యవంశీ అరంగేట్ర వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

అంత హైప్ అక్కర్లేదు..
అయితే వైభవ్ సూర్యవంశీపై మరీ అంతగా హైప్ తీసుకురావద్దని, అది అతనిపై అనవసర ఒత్తిడిని తీసుకొస్తుందని భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ హెచ్చరించాడు. ఈ అనవసర ఒత్తిడి వైభవ్ సహజ బ్యాటింగ్ శైలిని దెబ్బతీస్తుందని, బయటి విషయాలకు దూరంగా ఉంచుతూ ఈ టీనేజ్ సెన్సేషన్‌ను జాగ్రత్తగా సిద్దం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. అరంగేట్రానికి సిద్దంగా ఉంటే అవకాశం ఇవ్వాలని, వయసును పరిగణలోకి తీసుకోవద్దన్నాడు.
'వైభవ్ సూర్యవంశీ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంత క్రికెటర్లలో ఒకడు. అతనిపై మరి అంతగా హైప్ తీసుకురావద్దు. ఈ అనవసర హైప్ వైభవ్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అతని వయసు 15 ఏళ్ల మాత్రమే. ఈ వయసులో ఏది ఒప్పు.. ఏది తప్పు అనేది కూడా సరిగ్గా తెలియదు. టీ20 ఫార్మాట్లో అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అంతటి ప్రతిభావంతుడే.
వయసు చూడొద్దు..
అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ సిద్దంగా ఉంటే.. కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక బ్యాటర్ కెరీర్‌లో ఇదే పీక్ స్టేజ్ అని మనం అనుకున్నప్పుడు.. ఆలస్యం చేయడం ఎందుకు? అతను టెస్ట్ క్రికెట్‌లో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అతను ఒక అద్భుతమైన టీ20 బ్యాటర్ అని మనందరికీ తెలుసు. కెరీర్‌లో కఠినమైన పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఈ టాలెంటెడ్ కుర్రాడు ఆ పరిస్థితులన్నింటినీ తన కెరీర్‌లో ఎలా ఎదుర్కొంటాడనేది చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో కూడా అతనిపై సందేహాలు తలెత్తాయి. టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటర్ ప్రతిభను చూడాలి. తప్పా వయసును కాదు. అతను ఆడటానికి సిద్దంగా ఉంటే తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వాలి.'అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

