కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యమే టీమిండియాకు సమస్యగా మారిందని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. కెప్టెన్ విఫలమైతే ఆ ప్రభావం జట్టుపై పడుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టు అన్‌సెటిల్‌గా ఉందని, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయానికి కుదురుకోవాలన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. గత 6 నెలలుగా రెండు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 16 ఇన్నింగ్స్‌ల్లో 166 పరుగులు చేశాడు.
గత 10 ఇన్నింగ్స్‌ల్లో హిట్ మ్యాన్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. అతను చివరిసారిగా గతేడాది అక్టోబర్‌లో అర్థ శతకం సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. 2 పరుగులే చేసి అనవసర షాట్‌తో పెవిలియన్ చేరాడు.

రోహిత్ ఫామ్‌లోకి రావాలి..
తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడిన కపిల్ దేవ్.. రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. అప్‌కమిగింగ్ ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టుకు కపిల్ దేవ్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. మెరుగైన ప్రదర్శన చేసి జట్టును విజేతగా నిలబెట్టాలని ఆకాక్షించారు. 'రోహిత్ శర్మ స్టార్ ఆటగాడు. అతను త్వరగా ఫామ్ అందుకోవాలి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా గుడ్ లక్. జట్టు సెట్ అవ్వడానికి కాస్త సమయం పడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నాటికి అంతా సెట్ అయిపోవాలి.
దేశమంతా జట్టు మెరుగైన ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల కాలంలో భారత జట్టు బాగా ఆడుతోంది. కానీ కొన్నిసార్లు జట్టు కుదురుకున్నట్లు అనిపించలేదు. ఎప్పుడైతే కెప్టెన్ విఫలమవుతాడో ఆ ప్రభావం జట్టుపై పడుతోంది. జట్టు సరిగ్గా ఆడకపోతే అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తారు. అయితే, టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అభిమానులు భారత జట్టుకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి సీన్‌ను నా జీవితంలో చూడలేదు. ఆడకపోతే మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు. అందుకే ఆటగాళ్లను ఎక్కువగా ప్రశంసించవద్దు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే అంచనాలను ఆటగాళ్లు తట్టుకోలేరు.
బుమ్రా ఆడుతాడు..
వెన్నుగాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతాడు. గత రెండేళ్లుగా మరే ఇతర పేసర్ కూడా క్రికెట్‌పై ఇంతలా ప్రభావం చూపలేదు. గతంలో అనిల్ కుంబ్లే కూడా ఇలా గాయాల బారిన పడితే ఆ ప్రభావం జట్టుపై ఉండేది. ఇప్పుడు బుమ్రా కూడా అంతటి ప్రభావం చూపుతున్నాడు. అతను ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నా.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై శనివారం ఎన్‌సీఏ రిపోర్ట్ ఇవ్వనుంది. ఆదివారం ఇంగ్లండ్‌తో రెండో వన్డే జరగనుండగా.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.