విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో వరల్డ్ కప్ గెలవలేం.. కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతోనే ప్రపంచకప్ గెలవలేమని దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ అన్నాడు. ఇద్దరూ లేడా ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడితే మెగా టోర్నీలు గెలవడం కష్టమన్నాడు. జట్టులో కనీసం నలుగురు నుంచి ఐదుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలని, ఆ దిశగా టీమిండియా ప్రణాళికలు రచించాలని సూచించాడు.
ఈ ఏడాది టీమిండియా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడనుండగా.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడనుంది. ఈ రెండు మెగా టోర్నీలకు బీసీసీఐ ఇప్పటికే 20 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

ఆ ఇద్దరిపై ఆధారపడొద్దు...
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ల నేతృత్వంలో భారత్ ఇప్పటికే ఐసీసీ టోర్నీల్లో బరిలోకి దిగినప్పటికీ.. గత 13 ఏళ్లుగా ఒక్క టైటిల్‌ను కూడా గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్ అందుకు కావాల్సిన కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ చానెల్‌తో మాట్లాడిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వరల్డ్ కప్‌లో భారత్ గెలవాలంటే.. కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్లపై ఆధారపడొద్దని కపిల్ దేవ్ సూచించాడు.

జట్టు గురించి ఆలోచించాలి..
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేదా ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపై ఆధార పడితే భారత జట్టు వరల్డ్ కప్ గెలవలేదని కపిల్ దేవ్ కుండబద్ధలు కొట్టాడు. జట్టులో ఐదారుగురు మ్యాచ్ విన్నర్లు ఉండేలా టీమ్‌ను సిద్దం చేయాలని ఆయన మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. 'ఒకవేళ మీరు కప్ గెలవాలని అనుకుంటే.. కోచ్, సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి జట్టు గురించి ఆలోచించాలి'అని కపిల్ దేవ్ నొక్కి చెప్పాడు.

యువ ఆటగాళ్లతో టీమ్ బిల్డ్ చేయాలి..
ఆటగాళ్లను నమ్మాలన్న కపిల్ దేవ్.. మనకు కచ్చితంగ నమ్మదగ్గ ఆటగాళ్లు ఉన్నారని.. మ్యాచ్ విన్నర్లు కూడా ఉన్నారన్నారు. మనకు వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారన్నారు. యువ ఆటగాళ్లు ముందుకొచ్చి వరల్డ్ కప్ వేదికపై సత్తా చాటాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ పిలుపునిచ్చారు. 'మన జట్టుకు ఎప్పుడూ ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే మూలస్తంభాల్లా ఉంటున్నారు.
జట్టు వారి చుట్టూనే తిరుగుతోంది. దాన్ని మనం బ్రేక్ చేసి.. అలాంటి ఐదారుగురు ఆటగాళ్లను తయారు చేసుకోవాలి. అందుకే కోహ్లీ, రోహిత్‌లపై మనం ఆధారపడలేమని నేను చెబుతున్నా. తమ బాధ్యతలను నెరవేర్చే ఆటగాళ్లు మనకు కావాలి. యువ ఆటగాళ్లు ముందుకొచ్చి ఇది మన టైం అనుకోవాలి'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా ప్లాన్ షురూ..
టీ20ల విషయానికి వస్తే.. జట్టు మేనేజ్‌మెంట్ సీనియర్లను పక్కనబెట్టినట్టు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో యువ ఆటగాళ్లను పొట్టి ఫార్మాట్‌కు ఎంపిక చేస్తోంది. కానీ వన్డేల్లో మాత్రం కోహ్లీ, రోహిత్, శిఖర్ ధావన్ తదితర ఆటగాళ్లు ఇప్పటికీ కీలకంగా ఉన్నారు. టాప్ ఆర్డర్లో ఈ ముగ్గురు ప్లేయర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు జడేజా, బుమ్రా కూడా ముఖ్యం కానున్నారు. శ్రీలంకతో నేడు ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో టీమిండియా యాక్షన్ ప్లాన్ మొదలవ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications