అప్పుడే భారత్‌పై పాకిస్థాన్ గెలవగలదు: కపిల్ దేవ్

దుబాయ్: ఒక్కో రన్.. అభిమానికి ఊపిరి పోస్తుంది. ఒక్కో బాల్.. ఆటగాడిని నిలువెల్లా వణికించేస్తుంది. ఒక్కో షాట్.. బౌలర్లనూ చేష్టలుడిగేలా చేస్తుంది. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య యుద్దంలా సాగే టీ20 ప్రపంచకప్‌కే వన్నే తెచ్చే అసలు మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఎవరూ ఊహించని, మరెవరూ ఆలోచించలేని, మహాద్భుత ఘట్టాలు.. హై వోల్టేజ్ ఉత్కంఠలు.. ఊపిరి బిగపట్టే క్షణాలు.. ఉప్పొంగే నరాలకు వేదిక కానున్నభారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా ఫైట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌పై అనేక అంచనాలు విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు వెల్లడించారు. తాజాగా భారత దిగ్గజం కపిల్ దేవ్ ఈ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రెజర్ ప్రెజర్..
ఈ బిగ్ ఫైట్ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఎవరైతే ఈ ప్రెజర్‌ను హ్యాండిల్ చేయగలరో వారినే విజయం వరిస్తుందన్నాడు. భారత్.. ఒత్తిడికి చిత్తయితే పాకిస్థాన్ విజయం సాధించగలదన్నాడు. 'మైదానంలో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందనేది అనవసరం. రెండు జట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఎవరు ఈ ప్రెజర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారో చూడాలి. పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్ల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పటికీ ఆ జట్టు టీ20ల్లో డేంజరస్ టీమే. తనదైన రోజున ఆ జట్టు ఎంతటి బలమైన టీమ్‌నైనా ఓడించగలదు.'అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ అన్నాడు.

పాక్‌లో అంచనా వేయలేని ఆటగాళ్లు..
ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదన్న విషయం తెలిసిదే. 2019 ప్రపంచకప్‌లోనే చివరిసారిగే ఇరు జట్లు తలపడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ ఆడుతున్నాయి. మెగాటోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి. అయితే ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు లేనికారణంగా ఆ అస్థిరత కచ్చితంగా ఉంటుందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌లో మనం అంచనా వేయలేని ఆటగాళ్లున్నారని, అయితే పేపర్‌పై టీమిండియా బలంగా ఉందన్నాడు.
'మెగాటోర్నీల్లో మినహా ఇరు జట్లు పెద్దగా ఆడింది లేదు. కాబట్టి ఆ అస్థిరత అనేది కచ్చితంగా ఉంటుంది. భారత జట్టు బలంగా ఉనప్పటికీ.. పాకిస్థాన్‌లో అంచనా వేయలేని ఆటగాళ్లున్నారు. అయితే దీని గురించి భారత్ పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదు. ఒత్తిడిలో అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చిన జట్టునే విజయం వరిస్తుంది. భారత్ ఒత్తిడిని అధిగమించలేకపోతే పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవగలదు'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

ఇండియా హాట్ ఫేవరేట్..
చరిత్ర పరంగా చూసినా, ఆట పరంగా చూసినా ఐసీసీ మెగా ఈవెంట్లలో ఎప్పుడూ భారత్‌దే పైచేయి. అన్ని మెగా టోర్నీల్లో కలిపి ఇరుజట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీసేననే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 2007 టీ20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారతే గెలవడం, ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలో రావడం మరో విశేషం. ఇప్పుడు అదే ధోనీ మెంటార్‌గా రావడంతో జోష్, పోటీ రెట్టింపైంది. ఇరుజట్లు తమకు మరో మ్యాచ్ మాత్రమే అంటున్నా.. తెరవెనుక ఒత్తిడి మాత్రం ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో గెలుపు గీత దాటేదెవరో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications