Ravi Shastri vs Rahul Dravid: కపిల్ దేవ్ ఏమన్నాడంటే?

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఇది పురోగతిని కొనసాగిస్తే అతన్ని తప్పించాల్సిన పనిలేదని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత బీ జట్టుతో దిగ్గజ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక పర్యటనకు వెళ్లడంతో సోషల్ మీడియా వేదికగా రవిశాస్త్రిని పదవి నుంచి తప్పిస్తారా? అనే చర్చ ఊపందుకుంది. పైగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో లంక సిరీస్‌కు ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ అవుతాడా అనే దానిపై క్రికెటింగ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. విభిన్నంగా స్పందించాడు.

అనవసర చర్చ..
భవిష్యుత్తు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను సిద్దం చేయాలనుకోవడం మంచి ఆలోచనన్న కపిల్.. అత్యవసరంగా రవిశాస్త్రిని తప్పించాల్సిన అవసరం కూడా లేదన్నాడు. రవిశాస్త్రి మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తోనే టీమిండియా.. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిందని, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్, డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వెళ్లిందన్నాడు.
'మీరు కొత్త కోచ్‌ను సిద్దం చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే రవిశాస్త్రి కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు మాత్రం అతన్ని తప్పించాల్సిన అవసరమైతే లేదు. అయితే దీన్ని కాలమే నిర్ణయించాలి. ఇలాంటి చర్చలు, వార్తల వల్ల కోచ్‌లు, ప్లేయర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది' అని కపిల్ పేర్కొన్నారు.

సమస్యేం లేదు..
ఒకే సమయంలో రెండు భారత జట్లను అంతర్జాతీయ సిరీస్‌లు ఆడించడం వల్ల వచ్చే సమస్యేం లేదని కపిల్ దేవ్ అన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందని తెలిపాడు. దేశం తరఫున ఆడాలనే కోరికతో పాటు సత్తా చాటేందుకు మంచి వేదిక దొరుకుతుందన్నాడు. అయితే ఈ రోజుల్లో ఎక్కువ క్రికెట్ ఆడుతున్నందున జట్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలని కపిల్ పేర్కొన్నాడు.
'భారత్‌కు బలమైన రిజర్వ్ బెంచ్ ఉంది. ఒకే సమయంలో రెండు భారత జట్లు విజయం సాధిస్తే అంతకన్నా మంచి విషయం మరొకటి ఉండదు. అయితే ఒకేసారి ఇరు జట్లను ఒత్తిడికి గురి చేయడం అవసరమా? లేదా? అన్నది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకోవాలి'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

వారిని అవమానించినట్లే..
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ శుభ్‌మన్‌గిల్ స్థానంలో అక్కడే ఉన్న మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్‌లను తీసుకోకుండా.. శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా పిలిపిస్తే అక్కడున్న ప్లేయర్లను అవమానపరిచినట్లేనని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు కొత్తగా జట్టులోకి ఎవరినీ పంపాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు కూడా కాస్త బాధ్యతగా ఉండాలి. వాళ్లొక జట్టును ఎంపిక చేశారు. అప్పుడు కెప్టెన్, కోచ్‌లను సంప్రదించకుండా చేయరనే అనుకుంటున్నా' అని కపిల్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications