
మంచి నిర్ణయం..
'ఇది ఓ మంచి నిర్ణయం. ఓ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాక... మూడు లేదా నాలుగేళ్ల తర్వాత మళ్లీ రావాలి. కానీ, ధోనీ విషయంలో ఇది భిన్నంగా జరిగింది. ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అతడిని భారత జట్టుకు మెంటార్‌గా నియమించారు. మరోవైపు రవిశాస్త్రి కూడా ప్రస్తుతం కొవిడ్ బారిన పడ్డాడు. అందుకే ఇది ఓ ప్రత్యేకమైన నిర్ణయం అని చెప్పొచ్చు.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ధోనీ.. టోర్నీ ముగిసిన వెంటనే భారత ప్రపంకప్ జట్టుతో కలవనున్నాడు.

గవాస్కర్ సైతం..
ధోనీని మెంటార్‌గా నియమించడాన్ని దిగ్గజ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం స్వాగతించాడు. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రితో విభేదాలు తలెత్తితే మాత్రం జట్టుకు తీరని నష్టం జరుగుతుందని, ఈ ఒక్క విషయం మినహా మెంటార్‌గా ధోనీ జట్టుకు లాభపడుతాడన్నాడు. ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీకి సాటిలేరని, అతని విలువైన సలహాలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయన్నాడు. '2004లో టీమిండియా జట్టుకు మెంటార్‌గా నేను ఎంపికైనప్పుడు జాన్ రైట్(నాటి భారత జట్టు కోచ్) కాస్త దిగులుగా కనిపించారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో నేను ఉన్నానని అనుకున్నారు. కాబట్టి మెంటార్‌కు, కోచ్‌కు ఏకాభిప్రాయాలు ఉండటం చాలా ముఖ్యం.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఏకాభిప్రాయంతో పనిచేస్తే..
రవిశాస్త్రి, ధోనీ ఏకాభిప్రాయంతో పనిచేస్తే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మంచి ఫలితాలు సాధిస్తుందని గావస్కర్ పేర్కొన్నాడు. 'కోచ్ అవ్వాలనే ఆసక్తి ధోనీకి లేదని రవిశాస్త్రికి తెలుసు. శాస్త్రి, ధోనీ కలిసికట్టుగా ఉంటే జట్టుకు లాభం జరుగుతుంది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వస్తే జట్టుపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ధోనీ మెంటార్‌గా ఉండటం వల్ల జట్టుకు ఎంతో బలం చేకూరుతుందనే చెప్పొచ్చు.'అని దిగ్గజ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక రవిశాస్త్రి, ధోనీ ఒకే నిర్ణయంపై పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

గంభీర్ మాత్రం..
ఇక గౌతం గంభీర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బంది ఉండగా.. మెంటార్‌గా ధోనీ చేసేదేం ఉండదన్నాడు. 'బహుశా.. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ధోనీ.. మెంటార్‌గా వ్యవహరిస్తే జట్టుకు మంచి జరుగుతుందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు. అయితే ధోనీ ఎంపిక నైపుణ్యం పరంగా జరిగింది కాదు. ఎందుకంటే భారత జట్టులోని క్రికెటర్లందరూ నైపుణ్యం కలిగినవారే. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ధోనీ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసు కాబట్టి.. ఆటగాళ్లకు అది ప్రయోజనంగా మారొచ్చు. ముఖ్యంగా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లున్నారు. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తీ, సూర్యకుమార్ యాదవ్‌లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. వారితో ధోనీ తన అనుభవాన్ని కచ్చితంగా పంచుకుంటాడు. ఈ ఒక్క విషయంలో తప్పా ధోనీ వల్ల జట్టుకు ఒరిగేదేమి లేదు. స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, ఇతర సహాయ సిబ్బింది ఉండనే ఉన్నారు. " అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్ వరకే..
మెంటార్‌గా ధోనీని నియమించిన విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షానే స్వయంగా వెల్లడించాడు. ''ప్రపంచకప్‌లో భారత జట్టుకు ధోనీ మెంటార్‌గా ఉంటాడు. ఈ విషయంపై దుబాయ్‌లో అతనితో చర్చించాను. ప్రపంచకప్ వరకే ఆ పదవిలో ఉండేందుకు అతను అంగీకరించాడు. ఆ తర్వాత నేను సహచరులతో కూడా మాట్లాడా. మా అందరిదీ ఒకే అభిప్రాయం. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా మాట్లాడా. ధోనీ జట్టుతో ఉండేందుకు అంతా అంగీకరించారు'' అని జట్టును ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో షా చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బుధవారం సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లకు చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు. 2017లో అశ్విన్ చివరిసారిగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటం.. జట్టులోని కుల్చా జోడీ వైఫల్యంతో అశ్విన్‌కు మార్గం సుగుమమైంది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.


Click it and Unblock the Notifications












