టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా తన కంటే ఎంతో ఉత్తమమైన బౌలర్ అని కపిల్ దేవ్ కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024లో జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే.
సంచలన బౌలింగ్‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుస విజయాలతో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్తెంది. గయానా వేదికగా జరిగే సెమీఫైనల్-2లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ ఛానెల్‌తో మాట్లాడిన కపిల్ దేవ్.. బుమ్రాతో పాటు టీమిండియా ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో బుమ్రా ప్రదర్శనను చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందని కపిల్ దేవ్ అన్నాడు. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లపై బుమ్రా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడని అభినందించాడు.
'జస్‌ప్రీత్ బుమ్రా నాకంటే వెయ్యి రెట్లు అద్భుతమైన బౌలర్. ఈతరం క్రికెటర్లలో చాలా మంది మంచి నైపుణ్యం కలిగిన వారే. ప్రస్తుత టీమిండియాలో చాలా మంది నాణ్యమైన క్రికెట్ ఆడటంతో పాటు ఫిట్‌నెస్ విషయంలో చాలా ముందున్నారు. జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాగే కొనసాగితే గొప్ప క్రికెటర్లుగా కావడం పెద్ద కష్టమేం కాదు.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను పోల్చలేమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ అంత బలంగా లేకపోయినా.. ప్రత్యర్థి బౌలర్లను రోహిత్ అలవోకగా ఆడుతున్నాడని కపిల్ దేవ్ కితాబిచ్చాడు.
'కోహ్లీ ఫిట్‌నెస్ ఫ్రీక్. జిమ్‌లో వర్కౌట్లు చేయడానికి చాలా ఇష్టపడుతాడు. వాస్తవానికి, అతని వల్ల సహచర ఆటగాళ్లలోనూ చాలా మార్పు వచ్చింది. రోహిత్ శర్మ మాత్రం జిమ్ అంటే పెద్దగా ఇష్టపడడు. అలాగని ఫిట్‌నెస్ లేదని కాదు. సులువుగా షాట్స్ ఆడగలడు. తాజా టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ విఫలమైనా.. రోహిత్ అద్భుతంగా రాణించాడు. కోహ్లీ 150, 200 కేజీల బరువులు సులువుగా ఎత్తగలడు. అలాగని రోహిత్ శర్మ కూడా ఎత్తాలని లేదు. ఎవరి ఫిట్‌నెస్, ఎవరి ఆట వారిది. ఈ ఇద్దరిని పోల్చాల్సిన అవసరం లేదు.'అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.