టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌నెస్, క్రమశిక్షణ, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ వంటి మూడు అంశాలే ఆటగాళ్ల కెరీర్ కొనసాగించే విషయంలో కీలకమవుతాయన్నాడు. ప్రస్తుత తరంలో ఆటగాళ్లకు ఫిట్‌నెస్ చాలా కీలకమైందని చెప్పాడు.
సోమవారం మైఖేల్(Mykhel) ప్రతినిథితో ప్రత్యేకంగా మాట్లాడిన కపిల్ దేవ్.. క్రికెటర్ల ప్రైమ్ టైమ్ 26 నుంచి 34 ఏళ్లు అని తెలిపాడు. ఈ వయసులోనే గేమ్‌కు తగ్గట్లు ఆటగాళ్లు రాణించగలుగుతారని చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీ ఎప్పుడో ఈ వయసును ధాటేసారు. ఈ ఇద్దరూ క్రికెట్‌లో కొనసాగాలంటే ఫిట్‌నెస్, క్రమశిక్షణ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయాలు కీలకమవుతాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

'నా అభిప్రాయం ప్రకారం ఆటగాళ్ల ప్రైమ్ టైమ్ 26 నుంచి 34 ఏళ్లే. ఆ తర్వాత వారి కెరీర్ కొనసాగడం అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రైమ్ టైమ్ సమయంలోనే ఆటగాళ్లు తమ నైపుణ్యంతో పాటు ఆటపై సమగ్ర అవగాహనకు వస్తారు. పూర్తి సామర్థ్యంతో ఆడగలరు. 26 ఏళ్లలోపు ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నా.. మెచ్యూర్ అవ్వడానికి సమయం పడుతుంది.
కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని నిలకడగా రాణించడానికి కాస్త సమయం పడుతోంది. రోమ్ నగరాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు. అలాగే ఆటగాళ్లు ఎదిగేందుకు కూడా సమయం పడుతోంది. ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వాలనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ప్రతీ ఆటగాడికి వారి శరీరంతో పాటు మానసిక స్థితి, ఆటపై ఉన్న అభిరుచి తెలుస్తోంది. అ
లాగే ఫామ్, ఫిట్‌నెస్‌తో పాటు టీమ్ అవసరాలు కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. రవిశాస్త్రి చాలా త్వరగా రిటైర్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ మాత్రం సుదీర్ఘ కాలం ఆడాడు. అది వారి వ్యక్తిగత ఛాయిస్. ఫిట్‌గా ఉండి ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కెరీర్‌లో కొనసాగవచ్చనేది నా వ్యక్తిగత అభిప్రాయం.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. ఇక కపిల్ దేవ్ 35 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మకు 37 ఏళ్ల వయసు కాగా.. విరాట్ కోహ్లీకి 35 ఏళ్లు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకవచ్చు. ఇప్పటికే ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.