టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. ధోనీ, కోహ్లీ వల్ల కానిది.. శుభ్‌మన్ గిల్ సాధిస్తాడని, ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందిస్తాడని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. రవిచంద్రన్ అశ్విన్ మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు తప్పుకోవడంతో భారత జట్టు సంధి దశను ఎదుర్కొంటుంది.
రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ పర్యటనలోని ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ కెరీర్ ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవ్వనుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌కు తెరలేవనుంది.

ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్.. శుభ్‌మన్ గిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్ గిల్‌ను అనుభవం లేని ఆటగాడిగా చూడవద్దన్నాడు. 'శుభ్‌మన్ గిల్ ప్రతిభావంతమైన కుర్రాడు. ప్రస్తుతం అతను టీమిండియా కెప్టెన్. అతను ఖచ్చితంగా టైటిల్‌తో తిరిగొస్తాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత భారత జట్టును చూసి మేం గర్వపడుతున్నాం. వారికి బెస్టాఫ్ లక్. వారు పూర్తి సామర్థ్యంతో ఆడి మళ్లీ విజయాల బాట పడుతారని నేను ఆశిస్తున్నా.
శుభ్‌మన్ గిల్‌ను అనుభవం లేని ఆటగాడిగా చూడవద్దు. ఈ రోజు అనుభవం లేకపోవచ్చు. కానీ రేపు అనుభవం కలిగిన ఆటగాళ్లు మారుతారు. ఈ జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు ఏదైనా ప్రత్యేకంగా చేస్తారు. ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే .. వెళ్లండి.. మీ ఆటను మీరు స్వేచ్ఛగా ఆడండి. బాగా ఆస్వాదించండి. భారత జట్టుకు నేను చెప్పేది ఇదే.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా చివరిసారిగా 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో గెలిచిన టీమిండియా ఆ తర్వాత 2014, 2018, 2022 పర్యటనల్లో విజయాన్నందుకోలేకపోయింది. అజిత్ వాడేకర్ సారథ్యంలో 1971లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. మళ్లీ కపిల్ దేవ్ సారథ్యంలో 1986లో గెలుపొందింది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే కసితో యంగ్ ఇండియా ఉంది. అశ్విన్, రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌తో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్‌లకు అవకాశం దక్కింది. రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల రూపంలో సీనియర్ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.