అమ్మతోడు ఆ షాట్లు ఇంతవరకు చూడలేదు: కేన్ మామ

మౌంట్‌మాంగనీ: సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా చేతిలో ఓటమిపాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. సూర్య ఆడిన ఇన్నింగ్స్, తనకే సాధ్యమైన షాట్లను తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని చెప్పాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన కేన్ విలియమ్సన్.. తమ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని, బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైందని అంగీకరించాడు. సూర్య అసాధారణ ఇన్నింగ్స్‌తో తమ జట్టు ఏం చేయలేకపోయిందని, ఆటలోఇవన్నీ సహజమని పేర్కొన్నాడు.
సూర్య ఒక్కడే..
'ఈ మ్యాచ్‌లో మా జట్టుది అత్యంత చెత్త ప్రదర్శన. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానీ ఇన్నింగ్స్ ఆడాడు. నా జీవితంలో నేను చూసిన అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఇది. సూర్య ఆడిన కొన్ని షాట్లు అయితే నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. సూర్యతో పాటు భారత ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడారు. మేం మాత్రం మా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాం. బంతితోనూ మూమెంటమ్ అందుకోలేకపోయాం. కావాల్సిన వికెట్లు తీయలేకపోయాం. బ్యాట్‌తో కూడా మూమెంటమ్ అందుకోలేకపోయాం. మా ఆట తీరు మాకే అసహనం తెప్పించింది.
వరల్డ్ బెస్ట్ బ్యాటర్..
మళ్లీ చెబుతున్నా.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సే అతి పెద్ద తేడా. చేజింగ్‌లో భారత బౌలర్లకు స్వింగ్ లభించింది. దాన్ని వారు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. మేం కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. వాటిపై ఫోకస్ పెట్టి బలంగా తిరిగి వస్తాం. కొన్నిసార్లు ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి. సూర్యకుమార్ యాదవ్ మాత్రం వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.
సౌథీ హ్యాట్రిక్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(3/34) హ్యాట్రిక్ వికెట్ సాధించగా.. లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది.
కేన్ మామ జిడ్డు బ్యాటింగ్..
కేన్ విలియమ్సన్(52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపక్ హుడా (4/10) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసారు. భువనేశ్వర్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది. కేన్ మామ జిడ్డు బ్యాటింగ్.. న్యూజిలాండ్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications