ఒత్తిడితో ఓటమిపాలయ్యాం: కేన్ మామ

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక సెమీ ఫైనల్లో ఒత్తిడిని అధిగమించలేకనే ఓటమి పాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఈ ఒత్తిడి కారణంగానే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తప్పిదాలు చేశామన్నాడు. పాకిస్థాన్ మాత్రం అద్భుతమైన ఆటతీరుతో విజయాన్నందుకుందని ప్రశంసించాడు. బుధవారం ఏకపక్షంగా సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన విలియమ్సన్.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యామని అంగీకరించాడు.
ఒత్తిడికి చిత్తయ్యాం..
'ఆరంభంలో మేం చాలా ఒత్తిడికి గురయ్యాం. పాకిస్థాన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసింది. అయినా డారిల్ మిచెల్ సూపర్ బ్యాటింగ్‌తో మేం గేమ్‌లోకి వచ్చాం. సగం మ్యాచ్ పూర్తయ్యేసరికి మేం విధించిన లక్ష్యం పోరాడదగినదేనని భావించాం. వాడేసిన పిచ్ కావడంతో బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. అయితే పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయినందుకు చాలా నిరాశగా ఉంది. వాళ్లు మాత్రం అద్భుతంగా ఆడారు. ఈ రోజు మేం పూర్తిగా విఫలమయ్యాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం మాకు కష్టమే.

ఆ ఇద్దరూ..
బాబర్, రిజ్వాన్ అసాధారణ బ్యాటింగ్‌తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. నిజాయితీగా చెప్పాలంటే మేం కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాల్సింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో క్రమశిక్షణగా ఉండాల్సింది. ఏది ఏమైనా ఈ విజయానికి పాక్ ఆటగాళ్లు అర్హులు. అసాధారణమైన ఆటతో ఫైనల్ చేరారు. ఈ టోర్నీ ఆసాంతం మేం అద్భుత ప్రదర్శన కనబర్చినా.. కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసాం'అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

డారిల్ మిచెల్ రాణించినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(42 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అదరగొట్టిన రిజ్వాన్, బాబర్...
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(43 బంతుల్లో 5 ఫోర్లతో 57), బాబర్ ఆజామ్(42 బంతుల్లో 7 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications