పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కంటే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో నయమని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కంటే ఉమర్ అక్మల్‌కే మెరుగైన రికార్డు ఉందని చెప్పాడు.
వ్యక్తిగత స్కోర్‌తో పాటు స్ట్రైక్‌రేట్ విషయాల్లో కూడా కోహ్లీ కంటే ఉమర్ అక్మల్ రికార్డ్స్ మెరుగ్గా ఉన్నాయని తెలిపాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన కమ్రాన్ అక్మల్.. కోహ్లీ టీ20 ప్రపంచకప్ రికార్ట్స్‌ను ప్రస్తావిస్తూ తన తమ్ముడి గణంకాలతో పోల్చాడు.

'ఇటీవలే టీ20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన గణంకాలను చూశాను. నా సోదరుడు ఉమర్ అక్మల్ రికార్డ్స్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి. బ్యాటింగ్ ప్రదర్శనలో ఉమర్ అక్మల్.. కోహ్లీకి దరిదాపుల్లో కూడా రాడు. కానీ స్ట్రైక్‌రేట్, వ్యక్తిగత స్కోర్ విషయాల్లో కోహ్లీ కంటే ఉమర్ అక్మల్ గణంకాలు మెరుగ్గా ఉన్నాయి.'అని తెలిపాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 30 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 67.41 సగటు, 130.52 స్ట్రైక్‌రేట్‌తో 1146 పరుగులు చేశాడు. అయితే ఉమర్ అక్మల్ టీ20 ప్రపంచకప్ స్ట్రైక్ రేట్ 132.43గా ఉంది. కోహ్లీ వ్యక్తిగత స్కోర్ 83 నాటౌట్ కాగా.. ఉమర్ అక్మల్ హయ్యెస్ట్ స్కోర్ 94.
పాకిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుపై అతను వరుసగా 78 నాటౌట్, 36 నాటౌట్, 57, 82 నాటౌట్‌తో రాణించాడు. కానీ తాజా టీ20 ప్రపంచకప్‌లోనే దారుణంగా విఫలమవుతున్నాడు. పాకిస్థాన్‌పై 4 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ.. అమెరికాతో గోల్టెన్ డకౌట్‌గా వెనుదిరగాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగే చేశాడు.
ఓవైపు కోహ్లీ విఫలమైనా.. మరోవైపు టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు అర్హత సాధించింది. కోహ్లీ పేలవ ఫామ్ అభిమానులను కలవరపెడుతోంది. సూపర్-8లోనైనా కోహ్లీ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లీగ్ దశలో టీమిండియా చివరి పోరుకు సిద్దమైంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కెనడాతో అమీతుమీ తేల్చుకోనుంది.