ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అభిమానులు క్రియేట్ చేసిన ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. సాధారణంగా ఐపీఎల్‌లో అంపైర్లు బ్యాటర్ల బ్యాట్లను పరీక్షిస్తుంటారు. మైదానంలోకి వచ్చే ముందే ఫోర్త్ అంపైర్ సదరు బ్యాటర్ దగ్గరకు వెళ్లి బ్యాట్ గేజ్‌తో బ్యాట్ మందాన్ని పరీక్షిస్తారు.
అంపైర్ బ్యాట్‌ను ఆ 'గేజ్' మధ్యలో ఉన్న రంధ్రం గుండా పంపినప్పుడు, అది ఎక్కడా ఆగకుండా సులభంగా లోపలికి వెళ్లి అవతలి వైపుకు రావాలి. ఒకవేళ బ్యాట్ అక్కడ ఇరుక్కుపోయినా లేదా దూరకున్నా, ఆ బ్యాట్ నిబంధనలకు విరుద్ధమని అర్థం. అప్పుడు ఆ బ్యాట్‌ను వాడటానికి అనుమతించరు. మరో బ్యాట్‌తో బరిలోకి దిగాలని సూచిస్తారు.

మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నిబంధనల ప్రకారం, క్రికెట్ బ్యాట్ పరిమాణంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. బ్యాటర్లు తమ ఇష్టానుసారం భారీ వెడల్పు ఉన్న బ్యాట్లను వాడకుండా ఉండటానికి అంపైర్లు ఇలా పరీక్షిస్తారు. అయితే విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలను అంపైర్లు ఎన్నో సార్లు ఈ పరీక్ష చేశారు. అయితే రోహిత్ శర్మ బ్యాట్‌ను పరీక్షించిన ప్రతీసారి అతను అంపైర్లకు పాఠాలు నేర్పుతాడు.
బ్యాట్ గేజ్ నుంచి బ్యాట్ తీయడం ఎలాగో చెబుతూ.. తన బ్యాట్‌ను తానే పరీక్షించుకుంటాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లోనే అంపైర్‌కు రోహిత్ క్లాస్ పీకాడు. తానే బ్యాట్ గేజ్ నుంచి బ్యాట్ తీసి చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ క్రమంలోనే ధోనీ, కోహ్లీ బ్యాట్ గేజ్ టెస్ట్ సవ్యంగా సాగిపోతే.. రోహిత్ శర్మ మాత్రం అంపైర్లకు క్లాస్ పీకుతాడని, రోహిత్ శర్మనా మజాకా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్‌ను రోహిత్ శర్మ ఘనంగా ప్రారంభించాడు. కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌లో విధ్వంసకర(78) హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో 35 పరుగులు చేసి తన ఫామ్ కొనసాగించాడు. తొలి మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్..13 సీజన్ల తర్వాత ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది.