టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ గాలిగాడని, గుడ్డిగా బ్యాట్ ఊపుతాడని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమీర్.. అభిషేక్ శర్మను తక్కువ చేసి మాట్లాడాడు. అభిషేక్ శర్మ హిట్టింగ్‌లో ఎలాంటి నైపుణ్యం లేదని, అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు పరుగులు వస్తుంటాయని తెలిపాడు. అతను ఆడేది చాలా ప్రమాదకరమైన ఆట అని అభిప్రాయపడ్డాడు.
'అభిషేక్ శర్మ ఆటను నేను ఎక్కువగా చూడలేదు. కానీ నేను చూసిన కొద్దిపాటి ఆటను బట్టి నిజాయితీగా చెప్పాలంటే.. అతను కేవలం ఒక స్లాగర్(బాదుడుగాడు). అతను ప్రతీ బంతిని బలంగా బాదడానికే ప్రయత్నిస్తాడు. అతని రోజు బాగుండి ఆ ఆట క్లిక్ అయితే పర్వాలేదు. లేదంటే అతను విఫలమయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అతను 8 ఇన్నింగ్స్‌ల్లో ఒకసారి మాత్రమే స్కోరు చేస్తాడు. మిగిలిన సమయాల్లో అతని స్కోర్లు 10, 15, 0, 20 గానే ఉంటున్నాయి.

టెక్నికల్‌గా అతను పటిష్టమైన బ్యాటర్ అని నేను అనుకోవడం లేదు. అతను ఒకే చోటు నిలబడి, అన్ని బంతులు తను కోరుకున్న ప్రదేశాల్లోననే పడాలని ఆశిస్తాడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే, అతను ఫామ్‌లో ఉన్న రోజున భారీ స్కోరు చేస్తాడు. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసిస్తాడు. కానీ అతనిది చాలా రిస్క్‌తో కూడిన ఆట. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా అతను ఇలానే భారీ షాట్లు ఆడితే పక్కా బ్యాటర్ అని భావిస్తాను.'అని మొహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ.. పాక్‌తో మ్యాచ్ కూడా ఆడేది సందేహమేనని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే అభిషేక్ శర్మ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చని నమీబియాతో విజయానంతరం వరుణ్ చక్రవర్తీ మీడియాతో అన్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ ఆడటంపై సందేహం నెలకొంది. ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌పై అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.