టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోతే ఆ జట్టు బౌలింగ్ శూన్యమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ అన్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవలేదు. తొలి మ్యాచ్ టై చేసుకున్న భారత్.. చివరి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడింది. దాంతో శ్రీలంక 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
దాదాపు 27 ఏళ్ల తర్వాత భారత్‌పై ఆ జట్టు వన్డే సిరీస్ గెలిచింది. 1997లో చివరిసారిగా భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లతో పాటు పేసర్లు దారుణంగా విఫలమయ్యారు. మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు తీయడంలో తడబడ్డారు. స్పిన్నర్ల ఆధిపత్యం నడిచిన ఈ సిరీస్‌లో ఈ ఇద్దరూ తేలిపోయారు.

శ్రీలంక స్పిన్నర్లతో పోల్చితే భారత స్పిన్నర్లు సైతం పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలోనే భారత బౌలింగ్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ జీరో. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?'అని జునైద్ ఖాన్ ట్వీట్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విశ్రాంతిలో ఉన్న బుమ్రాను శ్రీలంక పర్యటనకు దూరం పెట్టారు. అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో అతనికి ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చారు.
చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. కుశాల్ మెండీస్(82 బంతుల్లో 4 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక(65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్‌లు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 26.1 ఓవర్లలోనే 138 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 35), వాషింగ్టన్ సుందర్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 4 ఫోర్లతో 20), శుభ్‌మన్ గిల్(6), రిషభ్ పంత్(6), శ్రేయస్ అయ్యర్(8), అక్షర్ పటేల్(2), రియాన్ పరాగ్(15), శివమ్ దూబే(9), కుల్దీప్ యాదవ్(6) దారుణంగా విఫలమయ్యారు.