పాపం జోస్ బట్లర్.. 207 బంతులాడి విచిత్రంగా హిట్ వికెట్ అయ్యాడు! (వీడియో)

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఫస్ట్ టెస్ట్ నుంచి సోమవారం ముగిసిన రెండో టెస్ట్ వరకు ఏదీ ఆ జట్టుకు కలిసిరాలేదు. టాస్, టీమ్ సెలెక్షన్, బ్యాట్స్‌మన్ ఔటవ్వడం అన్నింటిల్లోనూ వారికి నిరాశే ఎదురైంది. దురదృష్టానికి వారి చెత్తాట కూడా తోడవడంతో రెండో టెస్ట్‌లోనూ 275 పరుగుల భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ తన జిడ్డూ బ్యాటింగ్‌తో ఆశలు రేకిత్తించాడు. పూర్తిగా డిఫెన్స్ చేస్తూ ఓటమి తప్పించే ప్రయత్నం చేశాడు. దాదాపు 207 బంతులాడి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది.
తనదైన డిఫెన్స్‌తో ప్రతీబౌలర్‌ను ధీటుగా ఎదుర్కొన్న బట్లర్ చివరకు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాపం బట్లర్ భయ్యా.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్‌కు ఏం కలిసిరావడం లేదు కదా? అని ట్వీట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
వాస్తవానికి ఇంగ్లండ్ టీమ్ ఇంకా తక్కువ స్కోరుకే.. అదీ ఈరోజు తొలి సెషన్‌లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జోస్ బట్లర్ ( 207 బంతుల్లో 2ఫోర్లతో 26 ) గొప్ప పోరాట పటిమని కనబరుస్తూ.. ఇంగ్లండ్ జట్టులో డ్రా ఆశలు రేపాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ వోక్స్ ( 97 బంతుల్లో 7ఫోర్లతో 44)తో కలిసి దాదాపు 20 ఓవర్లు ఆస్ట్రేలియాకి వికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత వోక్స్ ఔటైనా.. ఓలీ రాబిన్సన్ (39 బంతుల్లో ఫోర్‌తో 8)తో కలిసి బట్లర్ పోరాడాడు. ఈ క్రమంలో.. బంతి ఏదైనా.. డిఫెన్స్ లేదా వదిలేయడం చేస్తున్న బట్లర్‌ని వదిలేసిన ఆస్ట్రేలియా బౌలర్లు.. మిగిలిన వికెట్లపై ఫోకస్ పెట్టినట్లు కనిపించింది.
కట్ షాట్ ఆడే క్రమంలో..
కానీ.. ఇంగ్లాండ్ స్కోరు 182 వద్ద బట్లర్ తనంతట తానే ఆస్ట్రేలియాకి వికెట్ సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 110వ ఓవర్ వేసిన జై రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో క్రీజులోకి డీప్‌గా వెళ్లిన జోస్ బట్లర్.. కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. ఈ క్రమంలో అతని పాదం ఆఫ్ స్టంప్‌ని తాకడంతో బెయిల్ కిందపడింది. అయినప్పటికీ.. గమనించని బట్లర్.. సింగిల్ కోసం క్రీజు వెలుపలికి వెళ్లాడు. కానీ.. అప్పటికే బెయిల్ పడటాన్ని చూసిన ఫైన్ లెగ్ ఫీల్డర్ సంబరాలు మొదలెట్టగా.. స్లిప్ ఫీల్డర్లు కూడా అతనికి తోడై సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆలస్యంగా తన తప్పిదాన్ని గ్రహించిన బట్లర్.. తనని తాను నిందించుకుంటూ నిరశగా పెవిలియన్ వైపు నడిచాడు.
జై రిచర్డ్ సన్ పాంచ్ పటాకా..
82/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 192 పరుగులకు కుప్పకూలింది. క్రిస్ వోక్స్(44), రోరీ బర్న్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా పేసర్ జై రిచర్డ్‌సన్(5/42) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనన్నాశాసించాడు. అతనికి తోడుగా మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55) రెండేసి వికెట్లు తీయగా.. మైకేల్ నేసర్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది.

దుమ్మురేపిన ఆసీస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. మార్నస్ లబుషేన్(103) సెంచరీతో రాణించగా.. కెప్టెన్ స్మిత్(93), ఓపెనర్ డేవిడ్ వార్నర్ తృటిలో టన్ మార్క్ అందుకోలేకపోయారు. అలెక్స్ క్యారీ(51) హాఫ్ సెంచరీతో మెరిసాడు. ఇక ఇంగ్లండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మలాన్(80), జోరూట్(62) మినహా అంతా విఫలమయ్యారు.ఇక 237 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 230/9 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. మార్నస్ లబుషే(51), ట్రావిస్ హెడ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక 468 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 192 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications