టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటి వరకు ఎంతో క్రికెట్‌ను చూసినా.. ఈ తరహా విధ్వంసకర బ్యాటింగ్ చూడటం ఇదే తొలిసారని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ(54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో 135) విధ్వంసకర శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/38) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/25) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్‌కి ఓ వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనియాడాడు. ఈ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాడు. 'ఈ సిరీస్‌ను కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సిరీస్‌లో మేం కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించాం. మరికొన్నింటిని మాత్రం మెరుగుపర్చుకోవాల్సి ఉంది. సొంతగడ్డపై భారత్ అద్భుతమైన జట్టు. మా ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి ఎక్స్‌పీరియన్స్. బౌలింగ్ ప్రదర్శనలు కొన్ని బాగున్నాయి.
ఈ రోజు కూడా బ్రైడన్ కార్స్, మార్క్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను ఎంతో క్రికెట్ చూశాను. కానీ టీ20ల్లో అభిషేక్ శర్మ లాంటి ఊచకోత ఇన్నింగ్స్‌ను ఈ రోజే చూశాను. అతని బాల్ స్ట్రైకింగ్ అసాధారణం. మా వరల్డ్ క్లాస్ బ్యాటర్ జోరూట్ జట్టులోకి వచ్చాడు. ప్రపంచంలోనే అతను ఓ అత్యుత్తమ బ్యాటర్. వన్డే సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాం. టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరా హోరీగా సాగుతోంది.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.