India vs England: టీమిండియానే టీ20 ప్రపంచకప్ ఫేవరెట్.. ఎందుకంటే: జోస్ బట్లర్

అహ్మదాబాద్: భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెట్ అని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీసేన బలమైన జట్టని, టీ20 ఫార్మాట్ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌కు ముందు మొతేరాలో ఐదు టీ20లు ఆడుతుండటం ఇంగ్లండ్ జట్టుకు లాభిస్తుందని బట్లర్ స్పష్టం చేశాడు.
కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడడం కూడా తమ జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. ఇయన్ మోర్గాన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, సామ్ కరన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆయా ప్రాంచైజీలకు ఐపీఎల్ ఆడుతున్నారు.

టీమిండియానే ఫేవరెట్
జోస్ బట్లర్ తాజాగా వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 'ఒకసారి ప్రపంచకప్ టోర్నీలను పరిశీలిస్తే.. ఆతిథ్య జట్లు మరింత మెరుగ్గా ఆడుతున్నాయని తెలుస్తుంది. అందుకే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.
బాగా ఆడుతున్న జట్లు ఇంకా ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా మెగా టోర్నీల్లో ఆతిథ్య జట్లు బాగా ఆడటం గమనార్హం. కోహ్లీసేన అన్ని ఫార్మాట్లలోనూ బలంగా ఉంది. టీ20ల్లోనూ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు' అని అన్నాడు. అరంగేట్రం ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో టోర్నీని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

మరే జట్టుకూ ఆడే అవకాశం రాలేదు
ప్రపంచకప్‌లోనూ ఎక్కువ మ్యాచులు మొతేరా మైదానంలో జరిగే అవకాశం ఉండటం తమకు లాభిస్తుందని జోస్ బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. 'మొతేరాలో బాగా ఆడి సిరీస్ గెలవాలని కోరుకుంటున్నాం. అలా జరిగితే ప్రపంచకప్ ముందు మా బృందంలో ఆత్మవిశ్వాసం నిండుతుంది. అందుకే ప్రపంచకప్ పరిస్థితుల్లో కోహ్లీసేనతో ఇక్కడ తలపడటం మాకు లభించిన అద్భుత అవకాశం. ఎందుకంటే అహ్మదాబాద్‌లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మరే జట్టుకూ ఆడే అవకాశం రాలేదు' అని బట్లర్ చెప్పాడు. ప్రస్తుతం మొతేరా వేదికగా భారత్-ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీసులో తలపడుతున్నాయి.

ఒప్పందం ముందే కుదిరింది
ఐపీఎల్ 2021 కోసం కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవచ్చన్న విమర్శల నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందించాడు. 'నాతో ఎవరూ అలాంటి చర్చలు జరపలేదు. మిగతా ఆటగాళ్ల సంగతి నాకు ఏమాత్రం తెలియదు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రకటించక ముందే ఐపీఎల్ భాగస్వామ్యంపై నాకు ఒప్పందం కుదిరింది. ఫ్రాంచైజీలు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే.. టెస్ట్ సిరీస్ ఆడని పరిస్థితి రావొచ్చు. ఏదేమైనా కివీస్ సిరీస్‌ను షెడ్యూలులో తర్వాత చేర్చారు. కానీ ఇంగ్లండ్ మ్యాచుల్ని ప్రతిసారీ కొందరు ఆటగాళ్లు మిస్సవుతూనే ఉంటారు. ఇది తెలుసుకోవాలి' అని బట్లర్ అన్నాడు.

మార్చి 12 నుంచి తొలి టీ20
మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 ఆరంభంకానున్న విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ కోల్పోయి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కూడా పోగొట్టుకున్న ఇంగ్లీష్ జట్టు టీ20 పట్టేయాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. మరోవైపు తొలి టీ20కి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీమిండియా కూడా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
405 రోజుల తర్వాత మ్యాచ్ ఆడడం సంతోషంగా ఉంది: ఫెదరర్