టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతో గత 'మే'లోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది.
ఇప్పటికే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల గడవు ముగిసి నెల రోజులు అవుతున్నా.. హెడ్ కోచ్ నియామకంపై మాత్రం బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టే ముందు గంభీర్ ఓ కండిషన్ పెట్టినట్లు సమాచారం. సపోర్ట్ స్టాఫ్ నియామకం విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని గంభీర్ బీసీసీఐని కోరినట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది.
ఈ క్రమంలోనే గంభీర్ తన కోచింగ్ టీమ్‌ను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడైన జాంటీ రోడ్స్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు 9 ఏళ్ల పాటు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించిన జాంటీ రోడ్స్.. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
గౌతమ్ గంభీర్ లక్నోకు మెంటార్‌గా ఉన్న సమయంలోనే అతను ఆ జట్టులో చేరాడు. 2019లో జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోగా.. అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి తిరస్కరించాడు. అప్పటి ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కాంట్రాక్ట్‌నే పొడిగించారు. రవి శాస్త్రి అనంతరం రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. అతను తనకు అనుకూలమైన సపోర్ట్ స్టాఫ్‌ను నియమించుకున్నాడు.
ఫీల్డింగ్ కోచ్‌గా తెలుగు తేజం టీ దిలీప్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేను తెచ్చుకున్న ద్రవిడ్... బ్యాటింగ్ కోచ్‌గా మాత్రం విక్రమ్ రాథోడ్‌ను కొనసాగించాడు. గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే సపోర్ట్ స్టాఫ్ మొత్తం మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సపోర్ట్ స్టాఫ్ విషయంలో స్వదేశీ కోచ్‌లను తీసుకున్నారు. రవిశాస్త్రి, ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్‌లుగా తెలుగు తేజాలు ఆర్ శ్రీధర్, టీ దిలీప్ సేవలందించారు. మరీ గంభీర్ ఎవరిని తీసుకుంటాడో చూడాలి..?