
లండన్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇటీవల ఇంగ్లండ్‌కు ఎదురైన వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ నిర్ణయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని జో రూట్ ప్రకటించాడు. ఐదేళ్ల పాటు జట్టు కెప్టెన్‌గా కొనసాగినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.
2017లో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న జోరూట్.. మొత్తం 63 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఎన్నో చిరస్మణీయ విజయాలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జో రూట్.. చివరకు టీమ్ పేలవ ప్రదర్శన కారణంగా సారథ్య బాధ్యతలను వదులుకున్నాయి.కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్‌గా చెత్త రికార్డును జో రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. జో రూట్... తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు.
ఇటీవలి కాలంలో పరిస్థితులు అంతగా సహకరించక పోయినా...జో రూట్ అనేక ప్రసిద్ధ సిరీస్ విజయాలకు నాయకత్వం వహించాడు. ఆస్ట్రేలియా మరియు కరేబియన్ పర్యటనల సమయంలో ఇంగ్లండ్ జట్టు ఒక టెస్ట్ గెలవలేకపోయింది. దానికి బాధ్యత వహిస్తూనే రూట్.. కెప్టెన్ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక ప్లేయర్ గానే కొనసాగనున్నాడు.
ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి తర్వాత రూట్‌పై విమర్శలు వెల్లు వెత్తాయి. అంతే కాకుండా వెంటనే ఇంగ్లండ్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేశారు. మరో వైపు యాషెస్ సిరీస్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి క్రిస్ సిల్వర్ వుడ్ తప్పుకున్నాడు. అప్పటి నుంచి రూట్ కూడా కెప్టెన్సీ తప్పుకుంటాడని వార్తలు షికారు చేశాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కెప్టెన్సీ నా వల్ల కాదంటూ రూట్ తప్పుకున్నాడు.