ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా క్రిస్టన్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో జోరూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌తో జో రూట్.. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. 2013లో అంతర్జాతీయ టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన సచిన్ మొత్తం 200 టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 1625 పరుగులు చేశాడు.

ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్..
తాజాగా జోరూట్ 1630 పరుగులతో సచిన్‌ను అధిగమించాడు. జోరూట్ 149 టెస్ట్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ జాబితాలో అలిస్టర్ కుక్, గ్రేమ్ స్మిత్ 1611 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. శివనారయన్ చంద్రపాల్ 1580 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
గతడేదిగా సూపర్ ఫామ్‌లో ఉన్న జోరూట్.. సచిన్ పేరిట ఉన్న ఒక్కో ఆల్‌టైమ్ రికార్డ్‌ను అధిగమిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగుల ఘనతపై కూడా జోరూట్ కన్నేసాడు. ఈ రికార్డ్ సచిన్ పేరిటే ఉంది. మాస్టర్ బ్లాస్టర్ 200 టెస్ట్‌ల్లో 15,921 పరుగులు చేశాడు. జోరూట్ ప్రస్తుతం 12,574 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 3-4 ఏళ్లలో సచిన్ రికార్డ్‌ను అధిగమించే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ ఘనవిజయం..
మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.104 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 104 పరుగులు చేసి గెలుపొందింది. జకోబ్ బెతెల్(37 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్(93) తృటిలో శతకం చేజార్చుకోగా.. గ్లేన్ ఫిలిప్స్(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ నాలుగేసి వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్(2/61) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యారీ బ్రూక్(171) భారీ శతకంతో చెలరేగగా.. ఓలీ పోప్(77), బెన్ స్టోక్స్(80) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులకే కుప్పకూలింది. బ్రైడన్ కార్స్(6/42) నిప్పులు చెరిగాడు.