ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌తో అధికార బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించినా..వ్యూయర్‌షిప్‌లో మాత్రం సరికొత్త రికార్డ్ నమోదైంది. ఈ మ్యాచ్‌కు 45.4 కోట్ల కాన్‌కరెంట్ వ్యూస్ వచ్చాయని జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్. క్రికెట్ లైవ్ మ్యాచ్‌లు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా అందుబాటులోకి వచ్చాక వ్యూస్ విపరీతంగా పెరిగాయి.
ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఒకే సమయంలో అత్యధికంగా చూసిన మ్యాచ్ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ (భారత్ vs ఆస్ట్రేలియా). దీనికి 5.9 కోట్ల (59 Million) లైవ్ కాన్‌కరెంట్ వ్యూస్ వచ్చాయి. అయితే జియో హాట్ స్టార్ తాజాగా ప్రకటించిన వ్యూస్. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు వచ్చి వెళ్లిన మొత్తం జనాభా సంఖ్య. కానీ లైవ్ కాన్‌కరెంట్ వ్యూయర్‌షిప్ అంటే ఒకే సమయంలో లైవ్‌లో ఉన్నవారు. భారత్-పాక్ మ్యాచ్‌కు ఈ సంఖ్య 6 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై భారత్ 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ విజయంతో గ్రూప్-ఏ నుంచి టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకోగా.. పాకిస్థాన్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో పాకిస్థాన్ నెట్‌రన్‌రేట్ కూడా దెబ్బతిన్నది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ బాయ్ కట్ డ్రామా ఆడింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించింది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. ఐసీసీ జోక్యంతో తలొగ్గి మ్యాచ్ ఆడింది. దాంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాత్ తారిక్ విలక్షణమైన యాక్షన్ మ్యాచ్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది.
కొలంబోలోని స్పిన్ కండిషన్స్‌కు తగ్గట్లు పాక్ జట్టులో ఆరుగురు స్పిన్నర్లు ఉండటంతో ఉత్కంఠ తప్పదని అంతా భావించారు. కానీ భారత్ ఆధిపత్యం ముందు పాకిస్థాన్ తేలిపోయింది. ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో ఆ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయి ఉంటే బ్రాడ్ కాస్టర్ జియో హాట్‌స్టార్ భారీ నష్టపోయేంది. కానీ బాయ్ కట్ డ్రామా హాట్‌స్టార్‌కు కలిసొచ్చింది. మ్యాచ్‌పై హైప్ క్రియేట్ చేసి వ్యూయర్‌షిప్ పెరిగేలా చేసింది.