కోహ్లీతో ఆ చిన్న సంభాషణ.. నా ఆటతీరునే మార్చేసింది: విండీస్ ప్లేయర్

జమైకా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో జరిగిన ఓ చిన్న సంభాషణ.. తన ఆటతీరునే పూర్తిగా మార్చేసిందని విండీస్ వైస్ కెప్టెన్ జెర్మైన్ బ్లాక్‌వుడ్ తెలిపాడు. గతేడాది జూన్ 2020లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ ఆ సిరీస్‌లో మొదటి టెస్టును వెస్టిండీస్ జట్టు గెలిచి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ టెస్ట్ గెలవడానికి అసలు కారణం.. జెర్మైన్ బ్లాక్‌వుడ్. మొదటి టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను బ్లాక్‌వుడ్ తన బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చాడు.

ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించడానికి కారణం:
తొలి టెస్ట్ మ్యాచ్‌లో 154 బంతుల్లో 95 పరుగులు చేసిన బ్లాక్‌వుడ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు గెలిచిన తర్వాత బ్లాక్‌వుడ్‌ను అందరూ పొట్టోడు చాలా గట్టోడు అని మెచ్చుకున్నారు. విండీస్ క్రికెటర్లలో దాదాపు అందరూ పొడుగ్గా ఉంటే.. బ్లాక్‌వుడ్ మాత్రం చాలా పొట్టిగా ఉంటాడు. ఇక ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన బ్లాక్‌వుడ్ మొత్తం రెండు హాఫ్ సెంచరీలతో 211 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించడానికి కారణం విరాట్ కోహ్లీ అని బ్లాక్‌వుడ్ తాజాగా చెప్పాడు.

సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చా:
ఇంగ్లండ్ పర్యటనకు ముందు 2019లో టీమిండియా విండీస్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడింది. అయితే జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఒక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీతో కాసేపు మాట్లాడాడు. ఆ విషయాలనే తాజాగా బ్లాక్‌వుడ్ పంచుకున్నాడు. '2019లో టీమిండియా మా దేశంలో పర్యటించినప్పుడు కోహ్లితో మాట్లాడేందుకు ప్రయతించా. అంతకముందు సోషల్ మీడియా వేదికగా కోహ్లీతో పలుసార్లు చాట్ చేశాను. జమైకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ చేసే బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాను. ఆట ముగిసిన తర్వాత కోహ్లీతో చిన్న సంభాషణ జరిగింది' అని తెలిపాడు.

ఆ సంభాషణ తర్వాత:
'నేను సెంచరీలు, అర్థ సెంచరీలు చేయాలంటే ఎలా ఆడాలో చెప్పాలంటూ విరాట్ కోహ్లీని అడిగాను. టెస్టులో సెంచరీ చేయాలంటే ఎన్ని బంతులు ఎదుర్కోవాలో చెప్పగలవా? అంటూ నన్ను ప్రశ్నించాడు. నేను సుమారు 212 బంతులు ఎదుర్కొంటే సెంచరీ చేసే అవకాశం ఉంటుందన్నా. నువ్వు చెప్పిన జవాబులో అర్థం ఉంది.. ఎన్ని బంతులు సమర్థంగా ఆడగలిగితే అన్ని సెంచరీలు చేయొచ్చు అని విరాట్ చెప్పాడు. ఆ సంభాషణ తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. టెస్టు మ్యాచ్‌లో ఆడితే కనీసం 200- 300 బంతులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఆ ఫలితమే ఇంగ్లండ్ పర్యటనలో కనిపించింది' అని బ్లాక్‌వుడ్ చెప్పాడు.

2 వన్డేలు మాత్రమే:
విండీస్ తరపున జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇప్పటివరకు 33 టెస్టులాడి 1789 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 112. 2014లో బ్లాక్‌వుడ్ విండీస్ తరపున టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఇక 2015లో వన్డేలోకి ఆరంగేట్రం చేసినా.. ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. రెండిటిలో 11 రన్స్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Sourav Ganguly: సర్జరీ విజయవంతం.. దాదాకు మరో 2 స్టెంట్లు!!