
న్యూఢిల్లీ: పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. కరోనా కారణంగా క్రీడా టోర్నీలు లేకపోవడంతో స్టార్ ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆస్వాదిస్తున్నారు. అయితే చాలా మంది ప్లేయర్లు సోషల్ మీడియాలోనే తమ సమాయాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నారు. కొందరూ.. ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంటే.. ఇంకొందరూ ఇతర ప్లేయర్లతో ఇన్‌స్టా లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ అలరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా బ్యాటరైన జెమీమా రోడ్రిగ్స్.. నటి, మోడల్, సోషల్ మీడియా ఫేమ్ రిధిమా పతక్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గురువారం లైవ్ చాట్ సెషన్ నిర్వహించింది. భారత జట్టులో అల్లరి అల్లరిగా ఉండే రోడ్రిగ్స్ తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఈ లైవ్ సెషన్‌ను ఆసక్తికరంగా మార్చింది.
అయితే ఈ సెషన్‌లో భాగంగా క్రికెట్‌లో ఇష్టమైన షాట్ ఏదని జెమీమాను ఆమె అభిమాని ఒకరు ప్రశ్నించారు. దీనికి ఈ భారత బ్యాటర్ కవర్ డ్రైవ్ అని తెలిపింది. ఆ వెంటనే ఈ షాట్ ఎవరు బాగా ఆడుతారనే ప్రశ్న ఎదురైంది. దీనికి జెమీమా.. పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేరు సూచించింది. అంతేకాకుండా బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్ షాట్స్ చూడటం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టులో జెమీమా సభ్యురాలేనన్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో జెమీమా అంచనాల మేరకు రాణించలేక పోయింది. కానీ తన అల్లరి పనులతో సహచర ప్లేయర్లలో ఉత్సాహాన్ని నింపింది. తన పరుగులతో కన్నా.. ఆట పాటతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది.