Jemimah Rodrigues: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ఫైనల్లో ఎదురైన ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండో టైటిల్‌ను ముద్దాడింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో ఫైనల్లోనూ ఓటమిపాలైంది.
ఆర్‌సీబీ విజయం లాంఛనమైన వెంటనే జెమీమా రోడ్రిగ్స్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. ఓటమి నేపథ్యంలో ఉబికి వచ్చిన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే మైదానం వీడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. మరోసారి టైటిల్ చేజారడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మ్యాచ్ అనంతరం కాసేపటికి క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్.. నేరుగా తన ఫ్రెండ్స్ స్మృతి మంధాన, అరుంధతి రెడ్డి వద్దకు వెళ్లి వారిని అభినందించింది. హగ్ చేసుకొని మరి మనస్ఫూర్తిగా వారి విజయాన్ని కొనియాడింది. నవ్వుతూ తన స్నేహితుల విజయాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేసింది. స్మృతి మంధానతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది.
రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రూ.3 కోట్ల క్యాష్ ప్రైజ్ దక్కింది. ఈ పరాజయంపై బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన జెమీమా.. 204 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేయాల్సిందని అభిప్రాయపడింది.ఫైనల్లో ఓడినా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, ప్రతీ ఒక్కరూ తమ సాయశక్తులా పోరాడారని, తమ సర్వస్వం ధారపోసారని తమ ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురిపించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది.