తన ఒక్కడి వల్లే శ్రీలంక విజయం సాధించలేదని ఆ జట్టు స్పిన్ సెన్సేషన్ జెఫ్రీ వాండర్సే అన్నాడు. బ్యాటర్ల అసాధారణ ప్రదర్శనతోనే శ్రీలంక విజయం సాధించిందని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో వన్డేలో శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే(6/33) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విజయం క్రెడిట్ తనొక్కడిదే కాదని, బ్యాటర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని చెప్పాడు.

'నేను బౌలింగ్ చేసే సమయానికి మా జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆ ఒత్తిడిని తగ్గించేందుకే నేను బంతిని అందుకున్నాను. చాలా రోజుల తర్వాత మైదానంలో దిగాను. 6 వికెట్లు తీసినందుకు ఈ గెలుపు క్రెడిట్ తీసుకోవడం సులవే. కానీ, మా విజయం వెనుక బ్యాటర్లదే కీలక పాత్ర. 240 పరుగులు సాధించే మేం పోరాడేందుకు సహకరించారు.
సరైన ప్రాంతంలో బౌలింగ్ వేయడంతోనే వికెట్లు దక్కాయి. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ దూరమవ్వడం జట్టుకు లోటే. టీమ్ కాంబినేషన్ సమతూకంగా ఉండేందుకు ప్రయత్నించాం. పిచ్ నుంచి కూడా సహకారం లభించడంతో నా పని తేలికైంది. తొలి వికెట్ తీశాక.. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అలాగే సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి 6 వికెట్లు తీసాను.'అని జెఫ్రీ వాండర్సే చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 3 ఫోర్లతో 35), అక్షర్ పటేల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే(6/33) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. చరిత్ అసలంక(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు.