
ముంబై: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తుది నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ తరహాలోనే ఈ మెగా టోర్నీని సైతం యూఏఈ వేదికగా నిర్వహించాలనుకుంటుంది. ఈ విషయాన్ని ఈ రోజు(సోమవారం) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి సమాచారం ఇవ్వనుందని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. 'టీ20 ప్రపంచకప్‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని నేడు(సోమవారం) ఐసీసీకి తెలియజేయనున్నాం. టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ నిర్ణయించనుంది.'అని జైషా పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ నిర్వహణపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆదివారం వెల్లడించిన జైషా రోజు వ్యవధిలోనే టోర్నీని యూఏఈకి తరలిస్తామని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్నామని.. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకమైందన్నారు. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించడం కష్టమనే అభిప్రాయానికి వచ్చాడు.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య ఐపీఎల్ 2021 నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. పొట్టి కప్ ఫైనల్ నవంబర్ 14న జరగనుందట. దాదాపు 28 రోజుల పాటు టీ20 ప్రపంచకప్ అభిమానులను అలరించనుంది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచులు అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒమన్ రాజధాని మస్కట్‌ను కూడా నాలుగో వేదికగా పరిగణలోకి తీసుకున్నారట. మొదటి వారం మ్యాచులు ఒమన్‌లో నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది.
ఇక వరల్డ్‌కప్‌ను యూఏఈ తరలించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెగా టోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం మొదటిది అయితే... కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వస్తారా? అన్నది రెండోది. యూఏఈలో టోర్నీ జరిగితే బీసీసీఐకి 41 శాతం ఆర్థిక లాభం చేకూరనుంది. ఒకవేళ భారత్‌లో ఈ టోర్నీ జరిపితే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వచ్చేది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పన్ను మినహాయింపు ఇప్పటివరకు లభించకపోవడం గమనార్హం.