వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ సెక్రటరీ జై షా అండగా నిలిచాడు. రాజ్‌కోట్ టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జై షా.. 15 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన విరాట్ కోహ్లీకి.. వ్యక్తిగత లీవ్ తీసుకునే హక్కు ఉందని చెప్పాడు.
'ఎవరైనా 15 ఏళ్ల పాటు ఆడినప్పుడు వ్యక్తిగత లీవ్ తీసుకోవడం వారి హక్కు. ఎలాంటి కారణం లేకుండా సెలవు తీసుకునే ఆటగాడు విరాట్ కోహ్లీ కాదు. మేం మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంతో పాటు అండగా నిలుస్తాం. జట్టుకు అందుబాటులోకి వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీతో మేం మాట్లాడుతాం.'అని జై షా చెప్పుకొచ్చాడు.

ఇక రెడ్ బాల్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా వైట్‌బాల్ ఫార్మాట్‌పై ఫోకస్ పెడుతున్న కుర్రాళ్ల గురించి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్‌సీఏ సూచనల మేరకు ఆటగాళ్లందరికీ కీలక ఆదేశాలు జారీ చేశామని చెప్పాడు. ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమైతే దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించామని తెలిపాడు.
సీనియర్ ఆటగాళ్లే కాకుండా కుర్రాళ్లు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని, రంజీ ట్రోఫీ బరిలోకి దిగాలని సూచించాడు. కుర్రాళ్లు వైట్‌బాల్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఆగ్రహంగా ఉన్నాడని చెప్పాడు. ఈ విషయంలో అతనికి పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు జై షా చెప్పుకొచ్చాడు.
'ఎన్‌సీఏ నుంచి మాకు వచ్చిన సలహాలను అమలు చేస్తున్నాం. రెడ్ బాల్, వైట్ బాల్ ఫార్మాట్‌ను ఆటగాళ్లందరు సమన్వయం చేసుకోవాలి. ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీ ఆడాలి. ముఖ్యంగా బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లందరూ ఈ ఆదేశాలను పాటించాలి.
రంజీ క్రికెట్ ఆడని ఆటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై చీఫ్ సెలెక్టర్ నాతో చర్చించారు. రంజీ ట్రోఫీ ఆడని ఆటగాళ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి అతనికి పూర్తి స్వేచ్చనివ్వబోతున్నాం.'అని జై షా చెప్పుకొచ్చాడు.
తొలుత మొదటి రెండు మ్యాచ్‌లు ఆడనని చెప్పిన కోహ్లీ.. చివరి మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణం చేత విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడనే విషయం తెలియడం లేదు. కోహ్లీ-అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని చెప్పిన ఏబీ డివిలియర్స్.. ఆ తర్వాత మాట మార్చాడు. దాంతో కోహ్లీ ఎక్కడ..? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.