పాకిస్థాన్ పేసర్ హరిస్ రౌఫ్ బలుపును టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తగ్గించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో కళ్లు చెదిరే యార్కర్‌తో హరిస్ రౌఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీసిన అనంతరం జెట్ విమానం కూలిందా? అన్నట్లు సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేశారు.
హరిస్ రౌఫ్ ఎక్స్‌ట్రాలను బుమ్రా కట్ చేశాడని, బూమ్ బూమ్ బుమ్రా అంటే ఏంటో పాక్ ఆటగాళ్లకు తెలిసొచ్చిందని కామెంట్ చేస్తున్నారు. సూపర్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హరిస్ రౌఫ్ వివాదాస్పద సైగలతో అభిమానులను రెచ్చగొట్టాడు. భారత రఫెల్ విమానాలను కూల్చేశామని, 6-0 అంటూ భారత ప్రేక్షకుల వైపు సంజ్ఞలు చేశాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత రఫెల్ విమానాలను కూల్చేసామని పాకిస్థాన్ అబద్దపు ప్రకటన చేసింది.

ఆ ప్రకటనను తెలియజేసేలా హరిస్ రౌఫ్ 6-0 అంటూ సైగలు చేశాడు. ఆ తర్వాత అతనికి మద్దతుగా పాక్ మహిళా క్రికెటర్లు, పాక్ హాకీ ప్లేయర్లు కూడా 6-0 అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఐసీసీ.. హరిస్ రౌఫ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. హరిస్ రౌఫ్‌కు ఆ రోజే అర్ష్‌దీప్ సింగ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. తాజాగా బుమ్రా.. అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి.. రఫెల్ కూలిందా? అంటూ సైగలు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్‌జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.