జస్ప్రీత్ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ తరం అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 150 కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో.. బంతి అందుకుని మ్యాచ్‌ను మన వైపు తిప్పిన యోధుడు. సూపర్ బౌలింగ్‌తో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టిన సూపర్ స్టార్.
టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బుమ్రా సూపరో సూపర్.. వరల్డ్ బెస్ట్ పేసర్ అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు కానీ, పసితనంలో అతను ఓ అనాథలా బతికాడని చాలా మందికి తెలియదు. అతని సక్సెస్ వెనుక పుట్టెడు దు:ఖం ఉంది. ముఖ్యంగా తన తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా శ్రమ ఎంతో ఉంది. అమ్మ కసితో పెంచిన ఈ టీమిండియా రాఖీ భాయ్ కథ గురించి తెలుసుకుందాం.

6 ఏళ్ల వయసులో తండ్రి మరణం..
పంజాబీ కుంటుంబానికి చెందిన జస్ప్రీత్ బుమ్రా తండ్రి పేరు జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. బుమ్రా ఆరేళ్ల వయసులో అతని తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. మనవడికి, కోడలికి అండగా ఉండాల్సిన బుమ్రా తాత సంతోక్ సింగ్ బుమ్రా.. వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు.
భర్త అకాల మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో.. బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది. అదే ఆమెలో కసిని పెంచింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాడ్ని చేయాలని కంకణం కట్టుకుంది. అప్పటికే వస్త్రపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమె.. తన బిడ్డకోసం మరింత కష్టపడింది. చిన్నతనంలోనే బుమ్రాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గుర్తించిన దల్జిత్ కౌర్.. అతన్ని క్రికెట్ వైపు ప్రొత్సహించింది.
ఓనర్స్ తిట్టకుండా...
ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా కింద ఉన్న ఇంటి ఓనర్లకు ఇబ్బంది కలగకుండా సరిగ్గా గోడ కింద భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు. చిన్నప్పుడు అలా ఆడుకోవడంతోనే తాను కచ్చితమైన యార్కర్లు వేయగలుగుతున్నానని ఓ ఇంటర్వ్యూలో బుమ్రానే చెప్పాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగాడు.
భర్త అండ లేకపోయినా.. అత్తింటివారు పట్టించుకోకపోయినా.. బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్‌గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని అందించిందనే చెప్పాలి. తన తల్లి కష్టానికి తగ్గట్లుగానే బుమ్రా ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. దేశం గర్వించే బౌలర్ అయ్యాడు. తన సహజమైన బౌలింగ్‌తో టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు.
జిజియా భాయ్ ఓ శివాజీని పెంచినట్టు.. తన కొడుకుని పెంచిన దల్జిత్ కౌర్ బుమ్రా లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం. అమ్మ కష్టం తెలుసుకుని, లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా కూడా యువతకి ఆదర్శం.