ఓ ఇంటివాడైన జస్‌ప్రీత్ బుమ్రా.. పెళ్లి ఫొటోలు షేర్ చేసిన యార్కర్ల కింగ్!

గోవా: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌ను సోమవారం వివాహం చేసుకున్నాడు. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను బుమ్రానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటి వరకు వీరి పెళ్లి జరుగుతుందని ఊహాగానాలు వినిపించాయి తప్పా అధికారిక ప్రకటన రాలేదు. కానీ బుమ్రా ట్వీట్‌తో అధికారికంగా వీరి పెళ్లిపై స్పష్టత వచ్చింది.
వివాహబంధంతో తామిద్దరం ఒకటయ్యామని, తమ జీవితాల్లోనే ఇదో అద్భుతమైన రోజని, ఈ శుభవార్తను పంచుకునేందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నామని బుమ్రా తెలిపాడు. 'ప్రేమ.. అది మిమ్మల్ని వెతుక్కొని వస్తే ఎంతో విలువైనది. మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం' అని బుమ్రా క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
ఇక బుమ్రా పెళ్లి ఫొటోలను ముంబై ఇండియన్స్ సైతం షేర్ చేసింది.. వారి పెళ్లి గురించి తనదైన శైలిలో రాసుకొచ్చింది. సంజనా బౌలింగ్‌లో బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడని, వీరు సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని దీవించింది. ప్రస్తుతం ఈ ట్వీట్, ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. భారత క్రికెట్ అభిమానులతో పాటు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు బుమ్రాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పెళ్లి కోసమే బ్రేక్..
పెళ్లి కోసం బుమ్రా ఇంగ్లండ్‌తో చివరి టెస్టుతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం గురించి గోప్యత పాటించిన బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు బీసీసీఐతో చెప్పించాడు. కానీ మీడియా ఆరా తీయగా.. అతను వివాహం చేసుకుంటున్నాడని తెలిసింది. అయితే వధువు ఎవరన్న విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. తొలుత సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనాని బుమ్రా వివాహం చేసుకోబుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహరం నడిచింది.

ప్రముఖులకు విందు..
అత్యంత సన్నిహితుల మధ్యనే వివాహం చేసుకున్న బుమ్రా.. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరికి విందు ఇవ్వనున్నట్లు వారి కుటుంబ వర్గాలు తెలిపాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
సంజనా బుమ్రా..
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7తో కెరీర్ ఆరంభించారు. ఇంజనీరింగ్ పట్టభద్రరాలైన సంజన ఐపీఎల్‌తో సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా సంజనా పనిచేశారు. సంజనాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.43 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రాను పెళ్లి చేసుకోవడంతో సంజన మరింత ఫేమస్ అయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications