Jasprit Bumrah: టెస్ట్ కెప్టెన్సీకి నేను రెడీ.. బుమ్రా సంచలన వ్యాఖ్యలు

కేప్‌టౌన్: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. సారథ్య బాధ్యతలు అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పాడు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమవడంతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్న విషయం తెలిసిందే. అతనికి డిప్యూటీగా జస్‌ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన జస్‌ప్రీత్ బుమ్రాను టెస్ట్ కెప్టెన్సీపై ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.

కెప్టెన్‌గా నేను రెడీ..
'టెస్ట్ కెప్టెన్‌గా నాకు అవకాశం ఇస్తే గొప్ప గౌరవంగా భావిస్తా. నాకు తెలిసి ఏ ప్లేయర్ కూడా కెప్టెన్సీ అవకాశం వస్తే వద్దని చెప్పడు. నేను కూడా అంతే. కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చినా.. రాకపోయినా నా ఆలోచన దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎల్లప్పుడూ జట్టు విజయం కోసం శ్రమిస్తాను. బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాను. అదనపు బాధ్యతల గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. వీలైనంత వరకు రాహుల్‌కి సహకారం అందిస్తూ.. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. యువ బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టినప్పుడు.. సీనియర్లను చాలా ప్రశ్నలు అడిగేవాడిని. వారి అనుభవాలు, సూచనలు, సలహాలు నా ఎదుగుదలకు చాలా ఉపయోగపడ్డాయి' అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

మా అందరికి చెప్పే..
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే విషయాన్ని టీమ్ మీటింగ్‌లోనే కోహ్లీ తమకు తెలియజేశాడని బుమ్రా తెలిపాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు అతన్ని అభినందించామని చెప్పుకొచ్చాడు. 'ఓ జట్టుగా మేమంతా చాలా క్లోజ్. టీమ్ మీటింగ్‌లోనే టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయాన్ని కోహ్లీ వెల్లడించాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. అతని సారథ్యానికి విలువ ఇస్తున్నాం. కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు అతన్ని అభినందించాం.'అని బుమ్రా పేర్కొన్నాడు.

జట్టులో ఎంతో మార్పు..
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టులో ఎంతో మార్పు తెచ్చాడని కొనియాడాడు. 'కోహ్లీ జట్టులో కొత్త శక్తితో పాటు ఫిట్‌నెస్ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. జట్టును అతను అద్భుత రీతిలో నడిపించాడు. ప్రతీ ఒక్కరు అతని సారథ్యంలో ఒకే డైరెక్షన్‌లో నడిచారు. విరాట్ అసాధారణమైన ఆటగాడు. కెప్టెన్సీ మార్పును మేం అర్థం చేసుకోగలం. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా చాలా క్రికెట్ ఆడారు. ఒక టీమ్‌గా దానికి మేం సానుకూల సహకారం అందిస్తాం'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

కమిన్స్ తరహాలో..
ఇప్పటికే విరాట్ కోహ్లీ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియాను నడిపించే సారథి ఎవరా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంపికైన రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు అప్పగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే అతనికి అతిపెద్ద ప్రతికూలాంశం ఫిట్‌నెసే. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా, టెస్ట్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తొలి సిరీస్‌కే గాయంతో దూరమయ్యాడు. పైగా 34 ఏళ్ల అతని వయసు కూడా చర్చనీయాంశమవుతోంది. దాంతో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే జట్టులో సీనియర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రాను కూడా పరిగణలోకి తీసుకోవాలని హర్షా భోగ్లే వంటి వ్యాఖ్యతలు సూచిస్తున్నారు. ఆసీస్ పేసర్ కమిన్స్ తరహాలోనే.. బుమ్రాకు అవకాశాలివ్వాలంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications