రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు జట్టుగా మద్దతు తెలిపామని స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో జట్టులో విబేధాలు వచ్చాయనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశాడు. అభిమానుల ట్రోలింగ్ విషయంలోనూ హార్దిక్ పాండ్యాకు రక్షణగా నిలిచామని తెలిపాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ఎంపిక చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు సహించలేకపోయారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గేలి చేశారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్‌కు పాల్పడ్డారు.

హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై ఇతర ఆటగాళ్లంతా అసంతృప్తిగా ఉన్నారని, జట్టుగా రెండుగా విడిపోయిందనే వార్తలు వచ్చాయి. అభిమానుల ప్రవర్తన హద్దులు ధాటింది. సంజయ్ మంజ్రేకర్ వంటి కామెంటేటర్స్.. ఇలా ట్రోల్ చేయడం సరికాదని మ్యాచ్ లైవ్‌లో చెప్పేంత పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బుమ్రా.. హార్దిక్ పాండ్యాకు జట్టు మొత్తం అండగా నిలిచిందని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేసిన వ్యక్తులే ప్రశంసల జల్లు కురిపించారని తెలిపాడు. 'హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం అండగా నిలిచింది. ఇలాంటి ట్రోలింగ్‌ను ఎవరూ ఎంకరేజ్ చేయరు. మేమంతా పాండ్యాకు పూర్తి మద్దతు ఇచ్చాం. కానీ కొన్నింటిని మనం కంట్రోల్ చేయలేం.
టీ20 ప్రపంచకప్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ 2024 సమయంలో పాండ్యాను ట్రోల్ చేసిన వాళ్లే.. టీ20 వరల్డ్ కప్ 2024లో అతని ప్రదర్శన చూసిన తర్వాత చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు తీసి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. 144 పరుగులతో పాటు 11 వికెట్ల తీసాడు.