న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. దాంతో పసికూన నేపాల్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. అత్యవసరంగా బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై అనేక ఊహగానాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఉన్నట్టుండి బుమ్రా స్వదేశానికి ఎందుకు పయనమయ్యాడని, కుటుంబ సభ్యుల్లో ఎవరైన అనారోగ్యానికి గురయ్యారా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. కానీ బుమ్రా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతని సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనుంది.

డెలివరీ టైమ్ దగ్గరపడటంతోనే బుమ్రా స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో బుమ్రా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. డెలివరీ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు బీసీసీఐ అనుమతితో బుమ్రా ముంబైకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ కూడా తన సతీమణి అనుష్క శర్మ ప్రసవ సమయంలో భారత జట్టును విడిచి ఇలానే వచ్చేసాడు.
ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా మళ్లీ జట్టుతో కలవనున్నాడు. అయితే ఈ విషయంపై బుమ్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే బౌలింగ్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయకపోయినా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు జోడించాడు.
బుమ్రా గైర్హాజరీలో నేపాల్‌తో మ్యాచ్‌లో మహమ్మద్ షమీ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయ్యింది.
ఇక్కడే శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యిన విషయం తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్ సాధ్యమవ్వలేదు. దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి.