టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం తీవ్రతపై స్పష్టత కొరవడింది. అతని గాయం తీవ్రతను తెలుసుకునేందుకు మరింత సమయం పట్టనుందని, ప్రస్తుతం బుమ్రా వీపుపై వాపు ఉందని, అది తగ్గిన తర్వాతే గాయం నుంచి కోలుకునే ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని బుమ్రాకు బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించినట్లు కూడా ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను జస్‌ప్రీత్ బుమ్రా ఖండించాడు. విశ్వసనీయత లేని మూలాలు అందించిన విషయాలను పరిగణలోకి తీసుకోవద్దని క్రికెట్ పీఆర్స్‌కు బుమ్రా సూచించాడు.

ఇంట్లోనే బుమ్రా..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో బుమ్రా వెన్ను నొప్పితో మైదానం వీడిన విషయం తెలిసిందే. వెంటనే అతన్ని స్కానింగ్ కోసం తీసుకెళ్లిన బీసీసీఐ మెడికల్ టీమ్.. బుమ్రాతో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అయితే స్కానింగ్ రిపోర్ట్స్‌లో ఏం వచ్చిందనేదానిపై ఇప్పటి వరకు బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ పర్యటన ముగిసిన వెంటనే బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
గాయం తీవ్రత ఎక్కువే..
బుమ్రా రిపోర్ట్ చేయాల్సిన తేదీ ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి మీడియాకు తెలిపినట్లు ఆ వార్తల్లో పేర్కొన్నారు. 'వచ్చే వారం బుమ్రా సీఓఈకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇంకా తేదీ ఖరారు కాలేదు. కండరాలు పుంజుకునేలా, వాపు తగ్గేలా ఇంట్లోనే మంచంపై విశ్రాంతి తీసుకోమని సూచించారు. వాపు తగ్గిన తర్వాత భవిష్యత్ కార్యచరణపై స్పష్టత వస్తుంది. ఈ తరహా విశ్రాంతి తీసుకోవాలని సూచించడాన్ని బట్టి చూస్తే బుమ్రా పరిస్థితి మెరుగ్గా లేదనే అనిపిస్తోంది. అది తీవ్రమైన డిస్క్ లేదా కండరాల వాపు కాకూడదనే కోరుకుంటున్నాం.'అని సదరు అధికారి చెప్పుకొచ్చినట్లు ప్రస్తావించారు.
ఫేక్ న్యూస్ చూసి నవ్వుకున్నా
బెడ్ రెస్ట్ తీసుకోవాలని వచ్చిన ఈ వార్తలపై బుమ్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ వార్తలను చూసి నవ్వుకున్నానని తెలిపాడు. 'ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేయడం సులవువని నాకు తెలుసు. అయితే ఈ వార్తను చూసి నవ్వుకున్నాను. విశ్వసనీయత లేని మూలాలు అందించిన విషయం ఇది'అని ముఫదల్ వోహ్రా అనే క్రికెట్ పీఆర్ చేసిన ట్వీట్‌కు బుమ్రా బదులిచ్చాడు.
Mufa getting dragged pic.twitter.com/LJBdrnxB44
— 🎰 (@StanMSD) January 15, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుమ్రా కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలెక్టర్లు కూడా అతని గాయం విషయంలో తొందరపెట్టే అవకాశం లేదని సమాచారం. దాంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడునున్న భారత్.. 23న పాకిస్థాన్‌తో తలపడనుంది.