టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్- సచిన్ ట్రోఫిలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (5/74) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు డబ్ల్యూటీసీలో ఇది 12వ ఐదు వికెట్ల ఘనత. ఈ క్రమంలో అతను రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను అధిగమించాడు. రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా (భారత్): 37* మ్యాచ్‌లు.. 12
రవిచంద్రన్ అశ్విన్(భారత్): 41 మ్యాచ్‌లు.. 11
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా): 50 మ్యాచ్‌లు.. 10
నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా): 53 మ్యాచ్‌లు.. 10
ప్రభాత్ జయసూర్య(శ్రీలంక): 19 మ్యాచ్‌లు.. 9
కగిసో రబడా (సౌత్ ఆఫ్రికా): 34 మ్యాచ్‌లు.. 8

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ రికార్డ్‌ను బుమ్రా అధిగమించాడు. లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన జోరూట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్ట్‌ల్లో అతన్ని ఔట్ చేయడం బుమ్రాకు 11వ సారి కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15వ సారి. వన్డేల్లో మూడు సార్లు ఔట్ చేసిన బుమ్రా.. టీ20ల్లో ఒకసారి పెవిలియన్ చేర్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జోరూట్‌ను ప్యాట్ కమిన్స్ 14సార్లు ఔట్ చేశాడు. టెస్ట్‌ల్లో అతన్ని 11 సార్లు పెవిలియన్ చేర్చిన కమిన్స్.. వన్డేల్లో మరో మూడు సార్లు ఔట్ చేశాడు. ఈ జాబితాలో జోష్ హజెల్ వుడ్(13), రవీంద్ర జడేజా(13), ట్రెంట్ బౌల్ట్(12) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఓవర్‌నైట్ స్కోర్ 251/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.
రవీంద్ర జడేజా ఓ వికెట్ తీసాడు. ఒక్క పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేయడం టీమిండియా కొంపముంచింది. ఈ అవకాశంతో చెలరేగిన అతను 8వ వికెట్‌కు బ్రైడన్ కార్స్‌తో కలిసి 84 పరుగులు జోడించాడు. జెమీ స్మిత్ క్యాచ్ పట్టి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగులకే ఆలౌటయ్యేది. బుమ్రా అందించిన ఆరంభాన్ని చెత్త ఫీల్డింగ్‌తో భారత ఆటగాళ్లు నాశనం చేసుకున్నారు.