
లండన్: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. 100 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అరుదైన ఘనతని సొంతం చేసుకోనున్నాడు.
2018లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకూ 22 టెస్టులాడి 22.62 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా ఆరు సార్లు అతను 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ప్రస్తుతం కపిల్‌దేవ్ టాప్‌లో ఉన్నాడు. కపిల్‌దేవ్ 25 టెస్టుల్లో ఈ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఒకవేళ లీడ్స్ టెస్టులో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. 23 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించి బౌలర్‌గా నిలవనున్నాడు. దాంతో కపిల్‌దేవ్ రికార్డ్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న బుమ్రా అదే జోరును కొనసాగిస్తే లీడ్స్ టెస్ట్‌లో ఈ ఘనతను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. పైగా లార్డ్స్ టెస్ట్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను సునాయసంగా 5 వికెట్ల పడగొట్టగలడు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బుమ్రా 3/33తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బంతితోనే కాదు.. బ్యాట్‌తోనూ సత్తాచాటిన బుమ్రా 9వ వికెట్‌కు మహ్మద్ షమీతో కలిసి 89 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో ఓటమిపాలవుతుందనుకున్న భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఇదే జోష్‌లో మూడో టెస్ట్‌లోను కొనసాగించి సిరీస్‌పై పట్టుసాధించాలని భావిస్తోంది.
ఇప్పటికే లీడ్స్ చేరుకున్న కోహ్లీసేన.. హెడింగ్లే స్టేడియంలో గత ఆదివారం ప్రాక్టీస్ షురూ చేసింది. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొడకండరాల గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. టీమ్ కాంబినేషన్స్ ఆధారంగా అతనికి చోటు దక్కే అవకాశం ఉంది.