టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతేడాది టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జస్‌ప్రీత్ బుమ్రాను ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్, శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

రాహుల్ ద్రవిడ్(2004), గౌతమ్ గంభీర్(2009), వీరేంద్ర సెహ్వాగ్(2010), రవిచంద్రన్ అశ్విన్(2016), విరాట్ కోహ్లీ(2018) బుమ్రా కంటే ముందే ఈ అవార్డ్ అందుకున్నారు. అయితే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన తొలి పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా చరిత్రకెక్కాడు.
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లోనూ బుమ్రా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది టెస్ట్‌ల్లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 13 టెస్ట్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్‌లో వెన్ను గాయానికి గురైన బుమ్రా.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. కానీ అతని ఫిట్‌నెస్ అప్‌డేట్‌పై అతను ఆడేది ఆధారపడి ఉంది.
జస్‌ప్రీత్ బుమ్రా కోలుకుంటే టీమిండియాకు కలిసి రానుంది. అతను అందుబాటులోకి రాకుంటే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలనుంది.