
డబ్లిన్: ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్(91 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 120), జన్నెమన్ మలాన్(169 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐర్లాండ్ ముందు సౌతాఫ్రికా 347 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ సంచలన విజయం నమోదు చేసింది. దాంతో కీలకమైన మూడో వన్డేలో సఫారీ బ్యాట్స్‌మన్ పరుగుల సునామీ సృష్టించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభం నుంచే ఐరీష్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఓపెనర్లిద్దరు తొలివికెట్‌కు 225 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. ముఖ్యంగా జన్నెమన్ మలాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డికాక్‌తో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. డికాక్ తర్వాత వచ్చిన ఫస్ట్ డౌన్స్ బ్యాట్స్‌మన్ డస్సెన్(30) కూడా ఓ చేయి వేయడంతో పరుగుల వరద పారింది. లాన్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ రెండు, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఐర్లాండ్ 12 ఓవర్లలో 3 వికెట్లకు 61 రన్స్ చేసింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, రెండో వన్డేలో ఆతిధ్య ఐర్లాండ్ సఫారీలపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్‌లో ఐర్లాండ్‌కు సఫారీలపై ఇదే తొలి విజయం కావడం విశేషం. దాంతో పరువు దక్కించుకునేందుకు సఫారీలు పాకులాడుతున్నారు.