సచిన్ కంటే అతనికి బౌలింగ్ చేయడం కష్టం: అండర్సన్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అని కితాబిచ్చాడు. అతనితో పోటీని ఆస్వాదించానని చెప్పాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడమే కష్టమని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అండర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సచిన్ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడంలోనే తాను సవాల్‌ను ఎదుర్కొన్నట్లు చెప్పాడు.
'2014లో తొలి ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ తడబడ్డాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ బలహీతను బయటపెట్టుకున్నాడు. దాంతో ఆ బలహీతనను ఉపయోగించుకొని అతనిపై ఆధిపత్యం చలాయించాను. కానీ 2018 పర్యటనలో విరాట్ కోహ్లీ ఆ బలహీనతను అధిగమించాడు. ఆ సమయంలో అతను భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. నాతో పాటు మా బౌలర్లందరిపై పైచేయి సాధించాడు.

విరాట్ కోహ్లీతో పోలిస్తే సచిన్ టెండూల్కర్ భిన్నమైన ఆటగాడు. అతను గొప్ప బ్యాటర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడు. కానీ విరాట్.. ఢీ అంటే ఢీ అంటాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేడు. అతనితో పోటీపడడాన్ని ఆస్వాదిస్తాను. కోహ్లీలో ఉన్న పోటీతత్వం, పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.'అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.
188 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జేమ్స్ అండర్సన్ 704 వికెట్లు తీసాడు. 700 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు. 32 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అండర్సన్.. 3 సార్లు 10 వికెట్ల ఘనతను సాధించాడు. గతేడాదే అండర్సన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
123 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అండర్సన్-కోహ్లీ 36 ఇన్నింగ్స్‌ల్లో తలపడ్డారు. కోహ్లీని అండర్సన్ 7 సార్లు ఔట్ చేశాడు. కోహ్లీ 43.57 సగటుతో 305 పరుగులు చేశాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీ 4 సార్లు ఔటయ్యాడు. 2018 పర్యటనలో మాత్రం కోహ్లీని అండర్సన్ ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications