James Anderson: జస్‌ప్రీత్ బుమ్రా.. గాయపర్చాలనే బౌన్సర్లతో దాడి చేశాడు!

లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు హద్దులు ధాటిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. లార్డ్స్ టెస్ట్ సందర్బంగా వీరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. రెండు జట్ల మధ్య వైరానికి దారి తీసింది.
ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా అండర్సన్‌కు బుమ్రా వేసిన ఓవర్ ప్రమాదకరంగా ముగిసింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్‌ను గాయపర్చాలనే ఉద్దేశం ఉందా? లేదా? తెలీదు కానీ 11వ నంబర్ బ్యాట్స్‌మన్‌పై అతను వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. తొలి బంతి హెల్మెట్‌కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్ 'కన్‌కషన్ టెస్ట్' కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు. తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్ సహా మొత్తం 10 బంతులు విసిరాడు.

ఆటలో మాటల యుద్దం..
ఈ తరహా బౌలింగ్‌తో విసిగిపోయిన అండర్సన్.. బుమ్రాపై మైదానంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'అప్పటి వరకు 80 మైల్స్ వేగంతో బంతులు విసిరిన నువ్వు.. నన్ను చూడగానే 90 మైల్స్ వేగంతో ఎందుకు బౌలింగ్ చేస్తున్నావు'అని కూడా ప్రశ్నించాడు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇక భారత సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా బ్యాటింగ్‌కు రాగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం బౌన్సర్లతో దాడికి దిగి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇదే వారి కొంప ముంచింది. వారి బౌన్సర్లను ధీటుగా ఎదుర్కొన్న బుమ్రా క్రీజులో పాతుకుపోయి.. 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. మహమ్మద్ షమీతో కలిసి 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించాడు. దాంతో భారత్ మ్యాచ్‌పై పట్టుసాధించి సునాయస విజయాన్నందుకుంది.

ప్రతీకారం తీర్చుకోవాలనుకొని..
అయితే బుమ్రా బ్యాటింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు అతన్ని మాటలతో కవ్వించారు. దీనికి భారత యార్కర్ల కింగ్ సైతం అదే తరహాలో బదులిచ్చాడు. 'మీరు ఎంత వేగంగా బౌలింగ్ చేసుకున్నా.. బౌన్సర్లు విసిరినా నేను అభ్యంతరం చెప్పను. నా బ్యాట్‌తోనే బదులిస్తాను. కానీ అనవసరంగా కామెంట్ చేస్తే మాత్రం ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వీరి వాగ్వాదంలో అంపైర్లు జోక్యం చేసుకొని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గొడవతోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అండర్సన్‌ను కామెంట్ చేశాడు. బూతు మాటలు తిడుతూ.. ముసలోడయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

నా శరీరమే లక్ష్యంగా..
తాజాగా ఈ ఘటనలపై జేమ్స్ అండర్సన్ స్పందించాడు. జస్‌ప్రీత్ బుమ్రా.. తన వికెట్ కోసం కాకుండా వేరే ఉద్దేశంతో బౌలింగ్ చేశాడన్నాడు. నోబాల్స్‌తో కలిసి అతను వేసిన 10 బంతుల్లో రెండింటిని మాత్రమే వికెట్లకు వేసాడని, మిగతావాటన్నిటిని తన శరీరానికి తగిలేలా సంధించాడని చెప్పుకొచ్చాడు. 'పిచ్ నెమ్మదిగా ఉందని చెప్పడంతో నేను మోచేతి గార్డ్ లేకుండానే మైదానంలోకి వచ్చాను. ఎందుకంటే ఔటైన బ్యాట్స్‌మన్ అంతా పిచ్ నెమ్మదిగా ఉందని చెప్పారు. వారు చెప్పినట్లే పిచ్ కూడా ఉంది. నేను క్రీజులోకి రాగానే జోరూట్ సైతం ఇదే మాట అన్నాడు. బుమ్రా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. కానీ నేను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే గంటకు 90 మైల్స్ వేగంతో విసిరాడు.

రెండే రెండు బంతులు..
ఇలాంటి బంతులను నా కెరీర్‌లో ఎప్పుడూ ఎదుర్కొలేదు. అతను నా వికెట్ తీయడానికి ప్రయత్నించడం లేదని అర్థమైంది. నో బాల్స్‌తో కలిసి అతను వేసిన 10 బంతుల్లో కేవం రెండే రెండు వికెట్ల మీదుగా రాగా.. నేను అడ్డుకున్నాను. కానీ ఆ తర్వాత నా శరీరాన్నే లక్ష్యంగా చేసుకొని బుమ్రా బంతులు సంధించాడు. దాంతో నన్ను నేను రక్షించుకునే ప్రయత్నం చేసి జో రూట్‌కు స్ట్రైక్ ఇచ్చాను.'అని అండర్సన్ చెప్పుకొచ్చాడు. మూడో టెస్ట్ కోసం ఇప్పటికే లీడ్స్ చేరుకున్న కోహ్లీసేన.. హెడింగ్లే స్టేడియంలో గత ఆదివారం ప్రాక్టీస్ షురూ చేసింది. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొడకండరాల గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. టీమ్ కాంబినేషన్స్ ఆధారంగా అతనికి చోటు దక్కే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications