న్యూఢిల్లీ: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్ రెండోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి చార్లీన్ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కలిస్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ చిన్నారి పేరును ప్రపంచానికి తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. 'అందమైన మా అమ్మాయిని మీ అందిరికీ పరిచయం చేస్తున్నా.. చోలే గ్రేస్ కలిస్.. ఈ ఉదయం(బుధవారం) 8.37 గంటలకు జన్మించింది.
మా చిన్నారి రాకుమారి 2.88 కిలోల బరువుతో పుట్టింది. ఇప్పటికే తాను తండ్రి చేతిని పట్టేసుకుంది. తల్లీ కూతురు ఇద్దరూ బాగున్నారు. నా కొడుకు జోషీకి తన చిట్టి చెల్లెలు ఎంతగానో నచ్చింది. మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి'అని కలిస్ ట్వీట్ చేశాడు. ఇక 47 ఏళ్ల వయసులో కలిస్ రెండో బిడ్డకు తండ్రవ్వడం విశేషం.

మూడేళ్ల క్రితం(2020) కలిస్ దంపతులకు కుమారుడు జోషువా హెన్నీ కలిస్ పుట్టాడు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను కలిస్ ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటాడు.
వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన జాక్వెస్ కలిస్.. సౌతాఫ్రికా తరఫున 166 టెస్ట్‌ల్లో 55.37 యావరేజ్‌తో 13,289 పరుగులు చేశాడు. 314 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 44.36 సగటుతో 11,579 రన్స్ చేశాడు. సచిన్ సమకాలీనుడైన కలిస్.. 23 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 35కిపైగా యావరేజ్‌తో 666 పరుగులు చేశాడు.
బ్యాట్‌తో సమానంగా బంతితోనూ సత్తా చాటిన ఈ సౌతాఫ్రికా క్రికెటర్.. టెస్టుల్లో 292 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 283 వికెట్లు తీసిన కలిస్.. టీ20ల్లో 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
23 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో.. టెస్టుల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న క్రికెటర్‌గా కలిస్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడిన కలిస్.. 2012లో ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఆ జట్టు మెంటార్‌గా, హెడ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.