యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మరోసారి తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) అరంగేట్ర సీజన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న క్రిస్ గేల్.. వీవీఐపీ ఉత్తరప్రదేశ్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
తృటిలో శతకాన్ని చేజార్చుకున్న క్రిస్ గేల్.. 46 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. 94 పరుగులు చేసి ఓ సిక్సర్ దూరంలో శతకాన్ని అందుకోలేకపోయాడు. క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా.. మరే బ్యాటర్ రాణించకపోవడంతో తెలంగాణ టైగర్స్‌కు ఓటమి తప్పలేదు. 45 పరుగుల తేడాతో తెలంగాణ టైగర్స్‌పై వీవీఐపీ ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా సారథ్యంలోని వీవీఐపీ ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 269 పరుగులు చేసింది. పవన్ నేగి(56 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 139) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. అన్షుల్ కపూర్(45 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సురేశ్ రైనా(13 బంతుల్లో 5 ఫోర్లతో 27) పర్వాలేదనిపించాడు. తెలంగాణ బౌలర్లలో సుదీప్ త్యాగి రెండు వికెట్లు తీయగా.. తిలక్, మన్‌ప్రీత్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన క్రిస్ గేల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగినా.. అతనికి మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. వికెట్ కీపర్ కమలేష్(22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.
ఉత్తరప్రదేశ్ బౌలర్లలో క్రిస్(5/36) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మోను కుమార్‌కు రెండు, అనురీత్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయం వీవీఐపీ ఉత్తరప్రదేశ్‌కు హ్యాట్రిక్ కాగా.. తెలంగాణ టైగర్స్‌కు రెండో ఓటమి. గత మూడు మ్యాచ్‌ల్లో తెలంగాణ టైగర్స్ ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.