సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శత్రు దేశం ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్‌లో బ్యాన్ చేయాలని బీసీసీఐని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో బీసీసీఐ ఏం చేయలేదని స్పష్టం చేశారు. ఈ అంశం బీసీసీఐ పరిధిలోకి రాదన్నాడు. 'ఇతర దేశాల లీగ్‌ల్లో ఫ్రాంచైజీ నిర్ణయాల విషయంలో బోర్డు ఏమీ చేయలేదు.'అని పేర్కొన్నాడు.
గురువారం జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ భారత అభిమానులు విమర్శలు గుప్పించగా.. సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా తాత్కలికంగా సస్పెండ్ అయ్యింది. ఈ వ్యవహారంపై సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్ స్పందించలేదు. ది హండ్రెడ్ వేలంలో ఆమె స్వయంగా పాల్గొంది.

మరోవైపు తమ నిర్ణయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి సమర్థించుకున్నాడు. అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడం తమ వ్యూహాత్మక నిర్ణయమని.. ఇందులో ఎలాంటి వివాదాలకు తావులేదని వెటోరి స్పష్టం చేశాడు. 'అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక డొమెస్టిక్ ప్లేయర్లు అబ్రార్ శైలిని అంత తేలికగా అంచనా వేయలేరు. వేలంలో మాకు చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ.. అతనే మా మొదటి ప్రాధాన్యత'అని వేటోరి పేర్కొన్నాడు.
పాకిస్థాన్ ఆటగాళ్లను భారత్‌కు చెందిన ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కేకేఆర్‌కు చెందిన ట్రిన్ బాగో నైట్‌రైడర్స్ తరఫున మహమ్మద్ అమీర్, ఉస్మాన్ తారిక్ ఆడారు. మేజర్ క్రికెట్ లీగ్ 2025 కోసం పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంను ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన సీటల్ ఓర్కాస్ కొనుగోలు చేసింది. ఐఎల్ టీ20 లీగ్‌లో కేకేఆర్‌కే చెందిన అబు దాబి జట్టు కూడా ఇమాద్ వసీం ఆడాడు.
ది హండ్రెడ్ లీగ్‌లో యార్క్‌షైర్ నుంచి సన్‌టీవీ 51 శాతం వాటను కొనుగోలు చేయగా.. 49 శాతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకుంది. దాంతో నార్తెర్న్ సూపర్ ఛార్జెర్స్ జట్టు కాస్త సన్‌రైజర్స్ లీడ్స్‌గా మారిపోయింది. ది హండ్రెడ్ వేలంలో పాకిస్థాన్ నుంచి ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ అమ్ముడవ్వగా.. షాదాబ్ ఖాన్, హ్యారీస్ రౌఫ్, సైమ్ అయూబ్‌లకు నిరాశే ఎదురైంది.
సన్‌రైజర్స్ లీడ్స్: నాథన్ ఎల్లిస్, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, అబ్రార్ అహ్మద్, బెన్నీ హోవెల్, డానియల్ లారెన్స్, టామ్ లావ్స్, మాథ్యూ పాట్స్, టామ్ అల్సోప్, జాక్ క్రాలీ, ర్యాన్ రికెల్టన్, లియామ్ ప్యాటర్సన్-వైట్, ఎడ్ బర్నార్డ్, రీస్ టోప్లీ.