
ఆక్లాండ్: టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను ఓ రిపోర్టర్.. 'రిషభ్ పంత్ జట్టులోకి వస్తాడా? ఈ సిరీస్‌లో ఆడుతాడా?’ అని ప్రశ్నించగా.. అతను హుందాగా సమాధానమిచ్చాడు. అది తనకు సంబంధించిన ప్రశ్న కాదనుకుంటా.! అని బదులిచ్చాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్(56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకు ముందు కీపర్‌గా రాణించాడు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రాహుల్ మీడియా సమావేశం నిర్వహించగా.. ఓ రిపోర్టర్ పంత్ విషయాన్ని ప్రస్తావించాడు. దీనికి రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇక ఈ ప్రశ్న అడిగిన రిపోర్టర్‌పై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేం పిచ్చి ప్రశ్న.. అతనేమన్న కెప్టెన్? లేక కోచా? అని మండిపడుతున్నారు.
ఇక కీపింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నానని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ తెలిపాడు 'వికెట్ కీపింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. ఐపీఎల్‌లో గత నాలుగేళ్లుగా కీపింగ్ చేస్తున్నా. కాకపోతే ఇంటర్నేషల్ లెవెల్‌లో ఇదే తొలిసారి. కీపింగ్ చేయడం వల్ల పిచ్ ఎలా స్పందిస్తుందో అర్థమవుతుంది. ఫీల్డింగ్ మార్పులు అవసరమైతే కెప్టెన్‌కు సూచిస్తున్నా. ఇక కీపింగ్ చేసిన తర్వాత ఎలాంటి షాట్లు ఆడాలో బాగా తెలుస్తోంది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
హాఫ్ సెంచరీతో చెలరేగిన అయ్యర్‌పై రాహుల్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'అయ్యర్ అద్బుతంగా ఆడాడు. ముఖ్యంగా ఒత్తిడిలో భారీ హిట్టింగ్‌తో జట్టుకు విజయాన్నందించాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా ఉన్న అనుభవం అతనికి ప్లస్ అయ్యింది. ఇది జట్టుకు మంచి పరిణామం. టెస్టుల్లో చోటు కోల్పోయిన తర్వాత నా ఆట ఏంటో అర్థమైంది. సానుకూలా ఆలోచనా ధోరణితోనే మందుకు సాగాలని నిర్ణయించుకున్న. పరిస్థితులకు అలవాటుపడాలనుకున్నా.'అని రాహుల్ తెలిపాడు.
ఇక న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 6 బంతులు ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ గాయంతో మళ్లీ ఓపెనర్‌గా అవతారమెత్తిన కేఎల్ రాహుల్ (56) సూపర్ ఫిఫ్టీతో చెలరేగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (45)తో కలిసి విజయానికి బాటలు వేసాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించింది. చివర్లో యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (58 నాటౌట్) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో కోహ్లీ సేన సునాయస విజయాన్నందుకుంది.